
‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ‘పావలా.. సన్నాసి’ అంటూ పవన్ కల్యాణ్‌పై ఆంధ్రప్రదేశ్ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విరుచుకుపడ్డారు. ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ డైలాగులు చెప్పే వ్యక్తి పావలా పవన్ కళ్యాణ్ అని.. విజయవాడ కార్పొరేషన్ లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయాడని చురకలు అంటించారు. పవన్ కంటే సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవరూ లేరని ఫైర్ అయ్యారు. రెండు చోట్ల పోటీ చేసి ఒక్క చోటకూడా గెలవలేక పోయాడని అన్నారు. సినిమా టికెట్లను ప్రభుత్వం అమ్మితే తప్పేంటని ప్రశ్నించారు. బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకుని బతికాలనుకునే నీచపు వ్యక్తి అని పవన్ పై నిప్పులు చెరిగారు. చిరంజీవి, ఇతరులు చెప్పడం వల్లనే ప్రభుత్వం టికెట్లు అమ్మడానికి ముందుకు వచ్చిందని మంత్రి చెప్పారు.
ముఖ్యమంత్రి జగన్ మీద, తమ మంత్రుల మీద పవన్ కల్యాణ్ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని ఆయన హెచ్చరించారు పవన్ కల్యాణ్ ‘రిపబ్లిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిస్పృహతో మాట్లాడారని ఆయన అన్నారు. అసలు అన్నయ్య చిరంజీవి లేకపోతే పవన్ జీరో అని ఆయన విమర్శించారు. పవన్ కల్యాణ్ ఫామ్ హౌస్ లో కూర్చుని పేకాట ఆడడానికి తప్ప దేనికీ పనికిరాడని వ్యాఖ్యానించారు. పావలా కల్యాణ్ ను మంత్రులమే పట్టించుకోవడం లేదని, ఇక ముఖ్యమంత్రి జగన్ ఎందుకు పట్టించుకుంటారని అన్నారు. సినిమా పేరు చెప్పుకుని బతికే వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ కల్యాణ్ వల్ల పలువురు నిర్మాతలు నాశమయ్యారని, పవన్ కల్యాణ్ తో చేసిన సినిమాలకు డబ్బులు రాక నష్టాల్లో కూరుకుపోయారని మంత్రి పేర్కొన్నారు.