
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై మరోసారి విరుచుకు పడ్డారు. ఆయన ఈ మధ్య ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై జనసేన చీఫ్ చేస్తోన్న వ్యాఖ్యలపై మండిపడ్డారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సజ్జల .. తమ ప్రభుత్వం సినీ పరిశ్రమకు మంచి చేయాలని చూస్తున్నామని చెప్పుకొచ్చారు.
సినీ పరిశ్రమలో కొందరు తమ ఆలోచనలను స్వాగతిస్తున్నారని, తమపై బురద చల్లాలని చూస్తే అది పవన్ కల్యాణ్‌కే ఇబ్బంది అవుతుందని సజ్జల అన్నారు. సినీ పరిశ్రమలోని పెద్దలే పవన్ కల్యాణ్‌ను గుది బండగా భావిస్తున్నారని ఆయన అన్నారు. పవన్ కల్యాణ్ సినిమా, రాజకీయాలు అనే రెండు పడవలపై కాళ్లు పెట్టారని ఆయన విమర్శించారు.
పవన్ వంటి వారితో ఇబ్బంది పడతామని సినిమా వారే భావిస్తున్నారని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. సినీ పరిశ్రమలకు సహకరించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఆన్లైన్ టికెటింగ్ విధానంతో డిస్ట్రిబ్యూటర్లు సంతోషంగా ఉన్నారని ఆయన అన్నారు. దీని వల్ల పారదర్శకత వస్తుందని చెప్పారు.
ఏపీలో పవన్ కల్యాణ్ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం మటన్ షాపులు పెడుతుందన్న ప్రచారంలో నిజం లేదని, మటన్ షాపుల్లో శుభ్రత పెంచేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు. బద్వేలు ఉప ఎన్నికలో మంచి మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.