
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం రోజున మహిళలు, కిశోర బాలికల ఆరోగ్యం, పరిశుభ్రతే ధ్యేయంగా రూపొందించిన ‘స్వేచ్ఛ’ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది మార్చి 8న స్వేచ్ఛ కార్యక్రమాన్ని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వివిధ శాఖలను మహిళా, శిశు సంక్షేమశాఖ పరిధిలోకి తెచ్చింది. ఈ కార్యక్రమాన్ని తాజాగా సీఎం ప్రారంభించి.. మాట్లాడారు. మహిళలు, బాలికలు ఆరోగ్యం, పరిశుభ్రతే ‘స్వేచ్ఛ’ కార్యకమ్ర లక్ష్యమని తెలిపారు. 7 నుంచి 12వ తరగతి చదువుతున్న 10 లక్షల మంది విద్యార్థినులకు ఉచితంగా శానిటరీ న్యాప్కిన్లు అందజేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10,388 స్కూళ్లు, కాలేజీల్లో ఈ కార్యక్రమం అమలు చేయనున్నట్లు చెప్పారు.
ప్రతి జిల్లాలో జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో పర్యవేక్షణ జరుగుతుందని పేర్కొన్నారు. మహిళా టీచర్లు, ఏఎన్ఎంలు బాలికలకు అవగాహన కల్పించాలని, ‘స్వేచ్ఛ’ పథకం అమలుపై నోడల్ అధికారిగా మహిళా టీచర్ను నియమించామని తెలిపారు. యూనిసెఫ్, వాష్, పీ అండ్ జీ తదితర సంస్థలతో కలసి అవగాహన తరగతులు నిర్వహించి రుతుక్రమంపై బాలికల అపోహలు తొలగించేందుకు కృషి చేయాలని సూచించారు. అలాగే, దిశ యాప్, దిశ చట్టం గురించి వివరించాలని అన్నారు. మహిళా సాధికారతలో ఏపీ మొదటి స్థానంలో ఉందని సీఎం జగన్ తెలిపారు.