
యాహూ… ఇంటర్నెట్ ప్రపంచంలో ఓ సంచలనం. ఇంటర్నెట్ రంగప్రవేశం చేసిన తొలినాళ్లలో ఎక్కువగా వినిపించిన పేరు. ఆ తర్వాత గూగుల్ రాకతో యాహూ కొంచెం వెనుకబడినా ఇప్పటికీ కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉంది. గత 20 ఏళ్లుగా యాహూ సేవలు ప్రీమియం, లోకల్ కంటెంట్ అందిస్తోంది. ఒకప్పుడు ఇంటర్నెట్కి పర్యాయపదంగా యాహూను వాడేవారు. అలాంటి వెబ్ సర్వీసుల ప్రొవైడర్ యాహూ.. భారత్‌లో న్యూస్ ఆపరేషన్స్‌ను నిలిపివేసింది. నేటి నుంచి యాహూ న్యూస్ కు స్వస్తి పలుకుతున్నట్టు ఓ ప్రకటనలో తెలిపింది. అందుకు తగ్గట్టుగానే యాహూ న్యూస్ లో ఎలాంటి తాజా కంటెంట్ ను పోస్టు చేయలేదు. అయితే యాహూ మెయిల్, సెర్చ్ సేవలు యథాతథంగా కొనసాగుతాయని యాహూ వెల్లడించింది. తమ వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగదని స్పష్టం చేసింది.
‘ఆగష్టు 26 నుంచి యాహూ ఇండియా.. ఎలాంటి కంటెంట్‌ను పబ్లిష్ చేయబోదు. యాహూ అకౌంట్‌తో పాటు మెయిల్, సెర్చ్ అనుభవాలపై ఎలాంటి ప్రభావం చూపెట్టబోదు. యూజర్లు వాళ్ల అకౌంట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనక్కర్లేద’ని యాహూ ఇండియా హోం పేజీలో ప్రకటించింది. ఇక ఈ ప్రకటనతో యాహూ న్యూస్, యాహూ క్రికెట్, ఫైనాన్స్, ఎంటర్టైన్మెంట్, మేకర్స్‌కు సంబంధించిన కంటెంట్ నిలిచిపోనుంది. ఎఫ్‌డీఐ కొత్త రూల్స్.. విదేశీ మీడియా కంపెనీలపై భారత నియంత్రణ చట్టాల ప్రభావం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు యాహూ స్పష్టం చేసింది.