
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ గోపురానికి స్వర్ణ తాపడం చేయిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భక్తులు కూడా పాలుపంచుకోవాలని సీఎం ఇచ్చిన పిలుపు మేరకు భక్తుల నుంచి విరివిగా విరాళాలు వస్తున్నాయి. మరోవైపు అధికారులు, నాయకులు, పారిశ్రామిక వేత్తలు సైతం విరాళాలు అందజేస్తున్నారు. భారీ స్పందన నేపథ్యంలో ఆలయం ఆవరణలో ప్రత్యేక హుండీని ఏర్పాటు చేసిన వైటీడీఏ.. ఆన్ లైన్ ద్వారా నగదు జమచేసేందుకు బ్యాంకు అకౌంట్ వివరాలను ఇప్పటికే వెల్లడించింది. తాజాగా ఆన్ లైన్ విరాళాల కోసం ఆలయ ఈవో గీతారెడ్డి క్యూఆర్ కోడ్ ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా గీతారెడ్డి మాట్లాడుతూ భక్తులు తమ ఫోన్లోని గూగుల్, ఫోన్‌పే, పేటీఎం ద్వారా క్యూ ఆర్‌కోడ్‌ను స్కాన్ చేసి నగదు జమ చేస్తే వైటీడీఏ అకౌంట్లోకి వస్తాయని తెలిపారు. స్వామివారికి చెందిన ఇండియన్ బ్యాంక్ యాదగిరిగుట్ట బ్రాంచ్ ఖాతాలో ఇప్పటివరకు రూ.1,06,14,315 నగదు జమ అయిందని తెలిపారు. విదేశీ భక్తుల నుంచి విరాళాలు సేకరించేందుకు ప్రత్యేక అనుమతులు తీసుకొన్నామని, త్వరలోనే ఈ సదుపాయాన్ని ప్రారంభిస్తామని వెల్లడించారు. బంగారు కానుకలు, నగదు విరాళాల స్వీకరణ నిమిత్తం ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్టు వెల్లడించారు.