
టీ20 వరల్డ్ కప్ మొదటి దశలోనే సంచలనాలు నమోదు అవుతున్నాయి. ఇవాళ జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్ తో ఐర్లాండ్ తలపడింది. ఈ మ్యాచ్ లో అద్భుతమైన బౌలింగ్ స్పెల్ నమోదైంది.
ఐర్లాండ్ యువ పేసర్ కర్టిస్ కాంఫర్ నెదర్లాండ్స్ పై వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీసి ఔరా అనిపించాడు. 22 ఏళ్ల కర్టిస్ కాంఫర్ తొలుత అకెర్మన్ (11) ను అవుట్ చేశాడు. ఆ తర్వాత సీనియర్ ఆటగాడు ర్యాన్ టెన్ డష్కాటేను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఆపై అదే తరహాలో బంతి వేసి స్కాట్ ఎడ్వర్డ్స్ ను కూడా ఎల్బీడబ్ల్యూ చేసి హ్యాట్రిక్ సాధించాడు. అంతేకాదు, ఆ తర్వాత బంతికి రైలోఫ్ వాన్ డెర్ మెర్వ్ ను బౌల్డ్ చేసి తన నాలుగో వికెట్ ను ఖాతాలో వేసుకున్నాడు. కాంఫర్ ఈ నలుగురిలో ముగ్గుర్ని డకౌట్ చేశాడు.
ఇక, మార్క్ అడైర్ విసిరిన ఇన్నింగ్స్ చివరి ఓవర్లో నెదర్లాండ్స్ ఆఖరి మూడు వికెట్లను కోల్పోయింది. మొత్తానికి ఓవర్లన్నీ ఆడి 106 పరుగులకు ఆలౌట్ అయింది. కాంఫర్ కు 4, అడైర్ కు 3 వికెట్లు, జాషువా లిటిల్ కు 1 వికెట్ లభించాయి. నెదర్లాండ్స్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ మాక్స్ ఓడౌడ్ సాధించిన 51 పరుగులే అత్యధికం. ఆ జట్టులో ఐదుగురు డకౌట్ అయ్యారు.