
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాలు రేపటి నుంచి మొదలుకానున్నాయి. రోజుకో అవతారంలో భక్తులను జగన్మాత కటాక్షించనుంది. మొదటి రోజు (రేపు) గురువారం ఉదయం 9 గంటలకు అమ్మవారి దర్శనం మొదలవుతుంది. తొలిరోజు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. 8వ తేదీన (రెండో రోజు) బాలా త్రిపుర సుందరీ దేవిగా.. 9న (మూడో రోజు) గాయత్రీదేవిగా, 10న (నాలుగోరోజు) లలితా త్రిపుర సుందరీ దేవిగా.. 11న (ఐదో రోజు) అన్నపూర్ణాదేవిగా.., అదే రోజు సాయంత్రం మహాలక్ష్మిదేవిగా అమ్మవారు దర్శనమిచ్చి.. భక్తుల కోర్కెలు నెరవేర్చనున్నారు. 12న సరస్వతీ దేవిగా, 13న దుర్గాదేవిగా, 14న మహిషాసుర మర్దనిగా, 15న చివరిరోజు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులను కటాక్షిస్తారు. 12వ తేదీన సరస్వతి దేవి అలంకరణ రోజున సీఎం జగన్.. ప్రభుత్వం తరఫున అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు.