
ఎన్ని భాషలు నేర్చుకున్నా మాతృభాషను మాత్రం మరవొద్దని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. ఏపీలోని అనంతపురంలో సెంట్రల్ యూనివర్శిటీ ఏర్పాటై మూడేళ్లయిన సందర్భంగా వ్యవస్థాపక దినోత్సవం గురువారం నిర్వహించారు. వర్చువల్ విధానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులు వీలైనన్ని భాషలు నేర్చుకునేలా ప్రోత్సహించాలని, అయితే మాతృభాషను మాత్రం మరవకూడదని చెప్పారు. ఏపీ అభివృద్ధిలో భాగస్వామ్యం వహించే విధంగా, విద్యారంగానికి మరితం ఊతమిచ్చే ఉద్దేశంతో రాయలసీమలో నాడు ఈ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేశారని అన్నారు.
ఈ విద్యా సంస్థ స్థాపనా దినోత్సవంలో పాల్గొనడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. విజయనగర సామ్రాజ్యంలో భాగమైన రాయలసీమకు ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉందని అన్నారు. భారతీయ సంస్కృతి, సాహిత్యం, కళలకు ఈ ప్రాంతం ఒకప్పుడు చుక్కానిగా నిలిచిందని కొనియాడారు. చదువుతో పాటు విద్యార్థులు మన సంస్కృతీసాంప్రదాయాల గురించి తెలుసుకోవాలన్నదే తన ఆకాంక్ష అని అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో భవిష్యత్ సవాళ్లకు అనుగుణంగా ఈ వర్శిటీ విద్యార్థులను తీర్చిదిద్దాలని సూచించారు. ప్రైవేటు విద్యా సంస్థలు ప్రాంతీయ భాషల్లో సమాచారాన్ని అందుబాటులోకి తేవాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆన్ లైన్ విద్యా అందరికీ అందుబాటులోకి రావాలని అన్నారు.