
దేశ వ్యాప్తంగా ఆన్ లైన్ లావాదేవీలు కీలక మైలురాయిని చేరుకున్నాయి. కొవిడ్ సంక్షోభం కారణంగా డిజిటల్ చెల్లింపులు పెరగడంతో ప్రస్తుత ఏడాది సెప్టెంబరు నెలకు సంబంధించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ ఫేస్(యూపీఐ) లావాదేవీలు సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. గత నెలలో యూపీఐ చెల్లింపులు రూ.6.50లక్షల కోట్లను దాటాయి. కరోనా పరిణామాల వల్ల ప్రజలు యూపీఐ తరహా చెల్లింపులకు ఆసక్తి చూపించారని, అందుకే సంఖ్యాపరంగా గణనీయమ వృద్ధి నమోదైందని ఎన్సీపీఐ తెలిపింది. వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలు ఎక్కువగా ఆన్ లైన్ లోనే జరిగాయని వెల్లడించింది. ఈ ఏడాది జనవరితో పోలిస్తే లావాదేవీల విలువ గత నెలలో 52శాతం మేర పెరిగింది.
2016లో యూపీఐ లావాదేవీలు ప్రారంభమైనప్పటి నుంచి నెలవారీ లావాదేవీల విలువ ఆధారంగా గత ఏడాది సెప్టెంబరు నాటికి రూ.3లక్షల కోట్ల మార్క్ ను దాటాయి. ఇందుకు నాలుగేళ్లకు పైగా సమయం పడితే.. కేవలం ఏడాదిలోనే ఆ విలువ రెట్టింపు అయింది. ప్రస్తుత ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకూ యూపీఐ లావాదేవీల సగటు వృద్ధి రేటు 5.8శాతంగా ఉంది. 2021-22ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి యూపీఐ లావాదేవీలు విలువపరంగా 1 ట్రిలియన్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. లావాదేవీల సంఖ్య 7,000కోట్లను అధిగమించవచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.