
యూపీలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్తున్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని అరెస్టు చేయడంపై తెలంగాణలో కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. రైతులను చంపినవారిని వదిలేసి బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రియాంక గాంధీని అరెస్టు చేయడమేంటని ప్రశ్నించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, ర్యాలీలు నిర్వహించాయి. బీజేపీ కార్యాలయాలను ముట్టడించేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో బీజేపీ శ్రేణులు ప్రతిఘటించడంతో కొన్ని చోట్ల తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర మంత్రి కుమారుడిపై హత్యకేసు నమోదు చేయాలని, అజయ్ మిశ్రాను వెంటనే మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టాయి. కేంద్రంలోని మోదీ సర్కార్ రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతూ నిరంకుశంగా వ్యవహరిస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ధ్వజమెత్తారు. కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడి అరాచకం వల్లే రైతులు మృత్యువాత పడ్డారని ఆరోపించారు.
నల్లగొండలో ఎంపీలు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంగారెడ్డిలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఇతర జిల్లాల్లో ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షురాలు గీతారెడ్డి, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ నిరసన తెలిపారు. హైదరాబాద్ లోయర్ ట్యాంక్ బండ్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. బీజేపీ కార్యాలయాలను ముట్టడించేందుకు యత్నించిన కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, యూపీలోని లఖీంపూర్ ఖేరి జిల్లాలో ఉన్న సీతాపురం అతిథి గృహంలోనే పోలీసులు నిర్బంధించిన విషయం తెలిసిందే. 36 గంటలుగా ఆమెను పోలీసులు నిర్బంధించడంపై యూపీలోనూ కాంగ్రెస్ శ్రేణుల నిరసన హోరెత్తుతోంది.