
తిరుమల శ్రీవారి దర్శనానికి ఒక్క డోసు వ్యాక్సిన్ తీసుకున్నవాళ్లనీ అనుమతించాలని టీటీడీ నిర్ణయించింది. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్న సర్టిఫికెట్ గానీ, మూడు రోజుల ముందు పరీక్ష చేయించుకున్న కొవిడ్ నెగెటివ్ రిపోర్టు గానీ ఉంటేనే తిరుమల కొండపైకి అనుమతిస్తామని టీటీడీ రెండురోజుల ముందు ప్రకటించిన విషయం తెలిసిందే. శుక్రవారం ఇందులో కాస్తంత వెసులుబాటు కల్పించింది. ఒక్క డోసు తీసుకున్న వాళ్లను కూడా అనుమతించాలని నిర్ణయించింది.
శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల సంఖ్యను పెంచిన నేపథ్యంలో.. వారి ఆరోగ్య పరిరక్షణకు నూతన నిబంధనలు అమలు చేయనున్నట్లు ఈవో జవహర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఈవోగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుమలకు వచ్చే భక్తులు.. రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్న సర్టిఫికెట్ గానీ, మూడురోజుల ముందు కరోనా పరీక్ష తాలూకు నెగెటివ్ సర్టిఫికెట్ గానీ తీసుకురావాలని సూచించారు. ఇవి లేకుండా తిరుమల కొండపైకి అనుమతించబోమని స్పష్టం చేశారు. మొదటి డోసు పూర్తయిన వారు కూడా దర్శనానికి రావచ్చన్నారు. కాగా, శ్రీవారి బ్రహ్మోత్సవాలు అక్టోబరు 7 నుంచి 15 వరకు నిరాడంబరంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సీఎం జగన్ ను త్వరలోనే ఆహ్వానిస్తామని చెప్పారు.