
తిరుమల తిరుపతి దేవస్థానం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఆన్ లైన్ దర్శనం టికెట్ల వెబ్ సైట్ లో పదే పదే సమస్యలు పునరావృతమవుతున్నాయన్న కారణంతో టీసీఎస్ ను తప్పించి జియో సంస్థకు బాధ్యతలు అప్పగించింది. ఉచిత సేవ పేరుతో సరైన సేవలు అందించడం లేదని టీటీడీ వాదిస్తోంది. అయితే, ముఖేష్ అంబానీకి చెందిన జియో సంస్థకు బాధ్యతలు అప్పగించడం వెనుక రాజకీయ పరమైన కారణాలున్నాయన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో రాష్ట్రంలోని రాజకీయ వర్గాల్లో ఈ నిర్ణయం పెద్ద దుమారం రేపుతోంది. ముఖేష్ తో జగన్ కు సన్నిహిత సంబంధాలున్నాయన్న వార్తల నేపథ్యంలో టీసీఎస్ ను కాదని జియో సంస్థకు బాధ్యతలు అప్పగించడం రాజకీయంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.
టీటీడీ ఆన్ లైన్ టికెట్ బుకింగ్ వ్యవస్థపై మొదటి నుంచి అనేక వివాదాలు ఉన్నాయి. కొన్నేళ్లుగా ఈ వెబ్ సైట్ ను టీసీఎస్ సంస్థ ఉచితంగా నిర్వహిస్తోంది. అయితే, తరచూ అంతరాయాలు ఏర్పడుతుండడం, సాంకేతిక లోపాలతో భక్తులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది. రాజకీయ ఒత్తిళ్లతో టీసీఎస్ ను ప్రశ్నించలేని పరిస్థితుల్లో టీటీడీ ఉంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వెబ్ సైట్ నిర్వహణ బాధ్యతను జియో సంస్థకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, దీనిపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అన్ని రకాల వసతులు అందుబాటులో ఉన్న నేపథ్యంలో టీటీడీనే సొంతంగా వెబ్ సైట్ ఎందుకు నిర్వహించకూడదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. నిధులకు ఇబ్బందులు లేనందున ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజనీర్లను నియమించుకుంటే సరిపోయే దానికి.. సంస్థల దయపై ఆధారపడడం దేనికన్న వాదన వినిపిస్తోంది