
టీఎస్ ఆర్టీసీ ఆదాయం గత మూడు నెలల్లో రికార్డు స్థాయిలో పెరిగిందని ఆ సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్ తెలిపారు. ఉద్యోగులు కొంచెం తోడ్పాటు అందిస్తే నష్టాల ఊబి నుంచి సంస్థ బయటపడుతుందని పేర్కొన్నారు. సోమవారం తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిలో మెడికవర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎమర్జెన్సీ చికిత్స కేంద్రాన్ని వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా గోవర్ధన్ మాట్లాడుతూ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఈ సంస్థను ఎక్కడ అమ్మేస్తారో, ప్రైవేట్ పరం అవుతుందోనని అందరూ అనుకునే వారని గుర్తుచేశారు. కానీ, సీఎం కేసీఆర్ వచ్చాక ఏటా రూ.40కోట్లు కేటాయిస్తూ ఆర్టీసీని ఆదుకుంటున్నారని పేర్కొన్నారు. సంస్థపై ప్రజలకు నమ్మకం కలిగించారని తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని నిర్ణయించారని, ఇందులో భాగంగానే తార్నాక ఆస్పత్రిని ఆధునికీకరిస్తున్నామని వెల్లడించారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు . ఉద్యోగుల సంక్షేమానికి యాజమాన్యం కట్టుబడి ఉంటుందని అన్నారు. తార్నాక ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నామని.. అందుకోసం ప్రణాళికలు రూపొందించామని తెలిపారు.