
దసరా పండుగ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ బస్సుల్లో సొంత ఊరికి వెళదామనుకుంటున్న ప్రయాణికులకు ఇది శుభవార్తే. ఈ ఏడాది నడపనున్న ప్రత్యేక బస్సుల్లో అదనపు చార్జీలకు బ్రేక్ పడింది. సాధారణంగా మామూలు సమయంలో నడిచే బస్సులతో పోలిస్తే దసరా ప్రత్యేక బస్సుల్లో సుమారుగా 50శాతం వరకూ అదనపు చార్జీలు వసూలు చేస్తుంటారు. అయితే, ఈ సంప్రదాయానికి ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెరదించారు. ఈ ఏడాది దసరా ప్రత్యేక బస్సుల్లో ఎలాంటి అదనపు చార్జీలు ఉండవని ఆదివారం ఆయన ప్రకటించారు. ముందస్తు రిజర్వేషన్ చేసుకునే వారి నుంచి సాధారణ టికెట్ రుసుమునే వసూలు చేస్తామని స్పష్టం చేశారు.
పండుగ సందర్భంగా 300 ప్రత్యేక బస్సులు నడపాలని టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. 8వ తేదీనే సర్వీసులు ప్రారంభమైనప్పటికీ ప్రయాణికుల నుంచి పెద్దగా ఆదరణ లభించలేదు. గతంలో దసరా బస్సులు ప్రారంభించిన తర్వాతి రోజుకే రద్దీ ఊపందుకునేది. సీట్లన్నీ నిండిపోయేవి. బస్టాండ్లు కిటకిటలాడేవి. కానీ, ఈ సారి అందుకు విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. గత మూడు రోజులుగా 30 ప్రత్యేక బస్సులను కూడా నడపలేకపోయింది. సాధారణ బస్సుల్లోనే సీట్లన్నీ ఖాళీగా ఉండడంతో స్పెషల్ బస్సుల వైపు ప్రయాణికులు కన్నెత్తి చూడడం లేదు. ఈ నేపథ్యంలోనే తాజా నిర్ణయం వెలువడి ఉంటుందని ఆర్టీసీ ఉద్యోగులు భావిస్తున్నారు.