
హుజూరాబాద్ ఉప ఎన్నికలో తనను ఓడించాలన్న కుట్రలో భాగంగానే కేసీఆర్ ప్రభుత్వం అనేక పథకాలకు రూపకల్పన చేస్తోందని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ మండిపడ్డారు. మూడు నెలలుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు.. కుల సంఘాల వారీగా దావత్ లు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. కానీ, ఇలాంటి దావత్ లతో ప్రజలను మభ్య పెట్టలేరని, వారంతా తన వెంటే ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. హుజూరాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించే గొంతును నొక్కేందుకు సీఎం కేసీఆర్ కుట్ర చేస్తుండగా.. మంత్రి హరీశ్ రావు బాధ్యత తీసుకుని అమలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలనే కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు.
ఇతర పార్టీల నాయకులను భయభ్రాంతులకు గురి చేసి గులాబీ కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు లాంటిదని అన్నారు. తెలంగాణ ధనిక రాష్ట్రమే అయితే.. భూములు అమ్మితే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఎందుకు వచ్చిందని నిలదీశారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా హుజూరాబాద్ ప్రజల మనస్సుల్లో తన స్థానాన్ని చెరిపివేయలేరని చెప్పారు. ప్రజల ఆశీస్సులతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు.