
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి మధ్య విభేదాలు మరో సారి భగ్గుమన్నాయి. పీసీసీ చీఫ్ తీరుపై ఎమ్మెల్యే ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ లో ఏ ఒక్కరూ హీరో కాలేరని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి వ్యక్తిగత ప్రచారం కోసం ఆరాటపడితే ఎలా? అని నిలదీశారు. సంగారెడ్డికి టీపీసీసీ అధ్యక్షుడు వస్తే తనకు సమాచారం ఇవ్వరా? అని ప్రశ్నించారు. శుక్రవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తనకు, ఆయనకు మధ్య విభేదాలు ఉన్నాయని చెప్పేందుకే ఇలా వ్యవహరిస్తున్నారా? అని ధ్వజమెత్తారు. ఇటీవల జహీరాబాద్ కు వెళ్లినప్పడు కూడా గీతారెడ్డికి విషయం చెప్పలేదని మండిపడ్డారు. గజ్వేల్ సభలో కనీసం తనకు మాట్లాడే సమయం కూడా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీనా? పబ్లిక్ లిమిటెడ్ కంపెనీనా? అని నిలదీశారు.
పార్టీలో చర్చించకుండానే రెండు నెలల పోరాట కార్యాచరణ ఖరారు ఎలా ప్రకటిస్తారని ప్రశ్నించారు. తనకూ అభిమానులు ఉన్నారని, రెండు లక్షల మందితో సభ పెట్టగలనని వ్యాఖ్యానించారు. రేవంత్.. పీసీసీ చీఫ్ కాకముందే తాను మూడు సార్లు ఎమ్మెల్యేనని గుర్తు చేశారు. టీఆర్ఎస్ లోకి తాను వెళ్లాలనుకుంటే అడ్డెవరని అన్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ జగ్గారెడ్డి.. మొదటి నుంచి రేవంత్ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఏకఛత్రాదిపత్యం కుదరదని, అందరితో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలని కోరుతూ వస్తున్నారు. రేవంత్ ఆధ్వర్యంలో చేపట్టిన అనేక కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఈ క్రమంలోనే మరోసారి టీపీసీసీ అధ్యక్షుడిపై విమర్శలు గుప్పించారు.