
తెలంగాణలో కొన్ని కీలకమైన వైద్య పరీక్షలు ఇక ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. ‘తెలంగాణ డయాగ్నస్టిక్’ కేంద్రాలను ఏర్పాటు చేయాలని సంకల్పించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆ దిశగా ఇప్పటికే 19 జిల్లాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటిలో ఇప్పటి వరకు పాథాలజీ పరీక్షలు మాత్రమే ఉచితంగా చేస్తుండగా.. ఇకపై రేడియాలజీ, వైరాలజీ పరీక్షలు కూడా ఉచితంగా అందుబాటులోకి రానున్నాయి. మరో 13 జిల్లాల్లో కూడా ఈ కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వ్యులు జారీ చేసింది.
కొత్తగా జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, మంచిర్యాల, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నారాయణ్ పేట్, పెద్దపల్లి, రంగారెడ్డి, సూర్యాపేట్, వనపర్తి, వరంగల్, హన్మకొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందుకోసం రూ.5.28 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
తెలంగాణ డయాగ్నస్టిక్ కేంద్రాల ఏర్పాటుకు ప్రభుత్వం విడుదల చేస్తున్న నిధులను జాతీయ ఆరోగ్య మిషన్ నుంచి కవర్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో కొవిడ్ నిర్దారణ కోసం 25 జిల్లా కేంద్రాల్లో ఇప్పటికే 25 ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లు ఉండగా.. మరో 8 జిల్లాల్లో కూడా వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల, ఆసిఫాబాద్, ములుగు, నాగర్ కర్నూల్, రాజన్న సిరిసిల్ల, వరంగల్, నారాయణపేట్ జిల్లాల్లో కొత్తగా ఆర్టీపీసీఆర్ ల్యాబ్ లు ఏర్పాటు కానున్నాయి. అందుకోసం రూ.10.61 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం టీ డయాగ్నస్టిక్ కేంద్రాల్లో 53 రకాల రోగ నిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తుండగా.. ఇక నుంచి ఈ కేంద్రాలో రేడియాలజీ విభాగానికి చెందిన ఎక్స్రే, సీటీ స్కాన్, ఎంఆర్ఐ, ఆల్ట్రా సౌండ్ తదితర పరీక్షలు కూడా ఉచితంగా చేస్తారని వైద్యశాఖ ఉన్నతాధికారులు వెల్లడించారు.