
తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల ముఖ్యమంత్రులపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ మధు యాష్కీ షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణ ప్రాజెక్టుల్లో కేసీఆర్కు, జగన్కు భాగస్వామ్యం ఉందని ఆరోపించారు. అమరుల త్యాగాలు, యువత ఆత్మహత్యలు, సబ్బండ జాతుల పోరాటంతోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది తప్ప, కేసీఆర్ దొంగదీక్షతో కాదని ఆయన విమర్శించారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు వస్తే తమకు అధికారం పోతుందనే అక్కసుతోనే ప్రభుత్వం అన్ని యూనివర్శిటీల్లో సగానికి పైగా ఖాళీలు భర్తీ చేయడం లేదని ఆరోపించారు. సమైక్య రాష్ట్రంలో ఆంధ్రోళ్లు దోచుకుంటున్నారని చెప్పిన కేసీఆర్, ఇప్పుడు తెలంగాణలోని ప్రాజెక్టుల కాంట్రాక్టులను వారికే ఇవ్వడం వెనుక కారణమేంటో చెప్పాలని మధు యాష్కీ డిమాండ్ చేశారు. తెలంగాణలోని అన్ని ప్రాజెక్టుల్లోనూ తెలంగాణ సీఎం కేసీఆర్కు, ఏపీ సీఎం జగన్కు పార్టనర్ షిప్ ఉందని ఆరోపించారు. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్కు బుద్ధి చెప్పడానికి తెలంగాణ యువతతో సహా అన్ని వర్గాల ప్రజానీకం సిద్ధంగా ఉందని అన్నారు.