
ఆర్టీసీ ప్రయాణీకులపై చార్జీల వడ్డింపుకు సిద్ధమైంది టీఎస్ ఆర్టీసీ. ప్రస్తుతమున్న టికెట్ ధరలపై 10 నుంచి 12 శాతం రేటు పెంచడానికి ఆర్టీసీ అధికారులు కసరత్తు పూర్తి చేశారు. పెంచిన టికెట్ రేట్ల ద్వారా ఆర్టీసీకి ఏటా వెయ్యి కోట్ల ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.
కేసీఆర్ సర్కార్ చివరి సారిగా 2019 డిసెంబర్ లో బస్సు చార్జీలను పెంచింది. కనీస టికెట్ రేటును రూ. 5 నుంచి రూ. 10కి చేర్చడంతో పాటు మొత్తంగా 20 శాతం రేట్లను పెంచింది. దీంతో, ఆర్టీసీ ఆదాయం రోజుకు రూ. 4 కోట్లు పెరిగింది. కానీ, కరోనా కారణంగా 2020 మార్చిలో లాక్డౌన్ ప్రారంభం కావడంతో ఆర్టీసీ బస్సులన్నీ డిపోలకే పరిమితమయ్యాయి. ఆ తర్వాత బస్సులు మళ్లీ రోడ్డెక్కినా, కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్లీ డిపోలకే పరిమితం అయ్యాయి.
ప్రస్తుతం కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టి ఆర్టీసీ ఆదాయం పుంజుకుంటోంది. రోజుకు సుమారు రూ. 13 కోట్ల రాబడి ఆర్టీసీకి లభిస్తోంది. అయితే, డీజిల్, విడిభాగాల రేట్లు పెరగడంతో రాబడి మొత్తం నిర్వహణకే సరిపోతోంది. దీంతో 10-12% చార్జీలు పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. సీఎం కేసీఆర్ సైతం ఆర్టీసీ రేట్లు పెంచడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ఆర్టీసీ త్వరలో ప్రయాణ చార్జీల వడ్డింపుకు సిద్ధం అవుతోంది.