
మూడేళ్ల తర్వాత అట్టహాసంగా టీఆర్ఎస్ ప్లీనరీ.. అందులోనూ ద్విదశాబ్ది వేడుకలు.. ఇంతటి ముఖ్యమైన కార్యక్రమానికి మంత్రి హరీశ్ రావుతోపాటు సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గైర్హాజరు కావడం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక ప్రచారంలో తలమునకలై ఉన్నందునే హరీశ్ రావు ప్లీనరీకి హాజరు కాలేదని చెబుతుండగా.. కవిత పాల్గొనకపోవడం అనేక సందేహాలకు తావిస్తోంది.
కొంత కాలంగా పార్టీ, కుటుంబ కార్యక్రమాలకు కవిత దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. పలు అంశాలపై నెలకొన్న విభేదాల వల్లే ఆమె పార్టీ శ్రేణులకు అందుబాటులో ఉండడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఉద్దేశపూర్వకంగానే ఆమె ప్లీనరీకి దూరంగా ఉన్నారా? లేదా అలక బూనారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అయితే, జ్వరం కారణంగానే కవిత ప్లీనరీకి రాలేకపోయారని ఆమెకు సన్నిహితంగా ఉండే కొందరు నాయకులు తెలిపారు. ప్లీనరీకి ఆహ్వానం అందిందని, దుబాయ్ నుంచి తిరిగొచ్చేటప్పటికే జ్వరంతో ఉన్నారని, విశ్రాంతి కోసం ఇంటికే పరిమితమయ్యారని పేర్కొన్నారు. ఏదేమైనా పార్టీలో కీలక నేత గా భావిస్తున్న కవిత గైర్హాజరు కావడంపై ప్లీనరీలో పెద్ద చర్చే జరిగింది.
మరోవైపు, హుజూరాబాద్ ప్రచార బాధ్యతలు నిర్వర్తిస్తున్న హరీశ్ రావు.. ప్లీనరీకి రాకపోవడానికి కేసీఆర్ ఆదేశాలే కారణమని తెలుస్తోంది. ఒక్క గంట అక్కడ లేకపోయినా పరిస్థితి తారుమారయ్యే అవకాశం ఉంటుందని, ప్రత్యర్థులకు ఆ చాయిస్ ఇవ్వకూడదనే ప్లీనరీకి రాలేదని చెబుతున్నారు. ఆయనతోపాటు మరో ఇద్దరు మంత్రులు కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ కూడా హాజరు కాకపోవడానికి ఇదే కారణమని సమాచారం. రాజకీయ నాయకులు పైకి చెప్పేదొకటైతే వారి మనస్సుల్లో మరొకటి ఉంటుందన్న సంగతి అందరికీ తెలిసిందే కదా.