
మూడేళ్ల విరామం తర్వాత జరుగుతున్న పార్టీ ప్లీనరీని గ్రాండ్గా నిర్వహించడానికి టీఆర్ఎస్ సకల ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా పార్టీ పుట్టినప్పటి నుంచి అధ్యక్షుడిగా ఉన్న కేసీఆర్ లాంఛనంగా మరోసారి చీఫ్గా ఎన్నిక కానున్నారు. ఎన్నికల అధికారి మారెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించనున్నారు. తొలుత వేదికపై నుంచి పార్టీ జెండాను కేసీఆర్ ఆవిష్కరిస్తారు. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పిస్తారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగే ప్లీనరీలో మొత్తం ఏడు రాజకీయ తీర్మానాలు ప్రవేశపెట్టనున్నారు.
తీర్మానాల కమిటీ చైర్మన్ హోదాలో అసెంబ్లీ మాజీ స్పీకర్ మధుసూదనాచారి వీటిని సభలో ప్రవేశపెడతారు. వీటిపై చర్చ జరిగిన అనంతరం ఆమోదం పొందనున్నాయి. రెండు సెషన్లుగా ప్లీనరీ నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు తొలి సెషన్, గంట పాటు భోజన విరామం తర్వాత మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మరో సెషన్ ఉంటుంది.
తీర్మానాలు ఇవే…
మరోసారి ఎన్నికైన పార్టీ అధ్యక్షుడికి అభినందనలు
టీఆర్ఎస్ ఆవిష్కరణ, విజయాలు- సాగు నీరు, వ్యవసాయం, ఆర్థిక పరిపుష్టికి తీసుంటున్న చర్యలు
సంక్షేమ తెలంగాణ సాకారం
పరిపాలన సంస్కరణలు- విద్యుత్తు, పారిశ్రామిక, ఐటీ రంగాల్లో అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన
దేశానికే దిక్సూచిలా దళితబంధు
విద్య, వైద్య రంగాల అభివృద్ధి
కేంద్ర ప్రభుత్వానికి టీఆర్ఎస్ డిమాండ్లు
ప్రభుత్వరంగ సంస్థల నుంచి పెట్టుబడులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవడం, సహకార వ్యవస్థను కేంద్రం తన ఆధీనంలోకి తీసుకోవడం, కొత్త సాగు చట్టాలు, రాష్ట్రాల హక్కులను హరించే విధంగా సాగునీటి ప్రాజెక్టుల్లాంటి విషయాల్లో కేంద్రం జోక్యం చేసుకోవడం, నూతన విద్యుత్ బిల్లు తదితర అంశాలపైనా టీఆర్ఎస్ వైఖరి ఏంటన్నది ప్లీనరీలో స్పష్టం చేయనున్నారు. అలాగే, ఇటీవలి కాలంలో చనిపోయిన 11 మంది పార్టీ నాయకులకు ప్లీనరీలో సంతాపం తెలపనున్నారు