
తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన సేవలు, సమస్త సమాచారం ఒకేచోట లభించేలా ప్రత్యేక యాప్ తయారు చేసేందుకు జియోతో టీటీడీ ఒప్పందం చేసుకుంది. తిరుమల అన్నమయ్య భవన్ లో జియో సంస్థ ప్రతినిధులతో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఈవో జవహర్ రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ ఐటి విభాగం అధికారులు సమావేశమయ్యారు. జియో ప్రతినిధి అనిష్ ఎంఓయుపై సంతకాలు చేశారు.
కోవిడ్ పరిస్థితుల్లో శ్రీవారి దర్శనం కోసం ఆన్ లైన్ ద్వారా పరిమిత సంఖ్యలో టికెట్లు జారీ చేయడంతో ఒకేసారి లక్షల మంది భక్తులు టికెట్ల కోసం ప్రయత్నించారు. దీంతో టీటీడీ సర్వర్లలో సమస్యలు ఏర్పడ్డాయి. ఈ సమస్యలను అధిగమించి భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శనం టోకెన్లు జారీ చేయడం కోసం జియో సంస్థ ముందుకు వచ్చిందని సుబ్బారెడ్డి చెప్పారు. ఐదేళ్లుగా ఉచితంగా టీటీడీకి సాంకేతిక సహకారం అందిస్తున్న టీసీఎస్ సంస్థ సమన్వయంతో జియో సంస్థ సేవలను వినియోగించుకోనున్నట్లు సుబ్బారెడ్డి తెలిపారు. ఈ యాప్ లో భక్తులకు అవసరమైన దర్శనం టిక్కెట్లు, రూముల బుకింగ్ వంటి సదుపాయాలన్నీ అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం యాప్ పని జరుగుతోంది. వైకుంఠ ఏకాదశి రోజు నుంచి యాప్ నుంచి మాత్రమే సేవలు అందించే అవకాశం ఉంది.