
తెలంగాణ బీజేపీ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా పరిధి బీజేపీకి చెందిన మణికొండ మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ నవీన్ కుమార్ రాజీనామా చేశారు. అనంతరం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అతనితో పాటు దాదాపు 200 మంది అనుచరులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా నవీన్ కుమార్ మాట్లాడుతూ. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితుడై టీఆర్ఎస్ పార్టీలో చేరానని వివరించారు. బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన తన అనుచరులు కూడా టీఆర్ఎస్ లో చేరారని తెలిపారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తోనే సాధ్యమని వెల్లడించారు. నేటి నుండి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తో కలిసి పని చేస్తానని చెప్పిన నవీన్ కుమార్.తన వార్డులో ప్రజలకు ఇచ్చిన హామీలు నేరవేరుస్తానని హామీ ఇచ్చారు.