
పన్నెండు సంవత్సరాల తర్వాత పవన్ కెరీర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రం గబ్బర్ సింగ్. ‘గబ్బర్ సింగ్’ తర్వాత మళ్ళి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ కలయికలో మరో చిత్రం రూపు దిద్దుకుంటుంది.
మైత్రీ మూవీ మేకర్స్ వారి నిర్మాణంలో, ఈ సినిమాకి సంబంధించిన కసరత్తు కొంతకాలంగా నడుస్తోంది. తాజాగా ఈ సినిమాకి టైటిల్ ను ఖరారు చేసి, టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ముందుగా ప్రచారం జరిగినట్టుగానే, ఈ సినిమాకి ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే టైటిల్ ను సెట్ చేశారు. భగత్ సింగ్ పేరుకు ముందు భవదీయుడు చేర్చడం వలన, ఫ్యామిలీ ఆడియన్స్ ఓట్లు కూడా కొల్లగొట్టేశారు.
ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చుతున్నాడు. ఇక ఆర్ట్ డైరెక్టర్ గా ఆనంద్ సాయిని తీసుకున్నారు. కథానాయికగా పూజాహెగ్డే పేరు వినిపిస్తోంది. అయితే ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. పవన్ ఒక వైపు ‘హరి హర వీరమల్లు’ చేస్తూనే, హరీశ్ సినిమాను కూడా చేయనున్నట్లు చెబుతున్నారు.