
కొమారి జానకి రామ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం GST ( గాడ్ సైతాన్ టెక్నాలజీ) థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ‘GST’ ట్రైలర్ ను లాంచ్ చేశారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ కు ఆయన అభినందనలు తెలిపారు. తలసాని మాట్లాడుతూ, ఈ చిత్రం టైటిల్ చాలా బాగుందని ప్రశంసించారు. ఈ మూవీ కాన్సెప్ట్ గురించి దర్శకుడు తనకు చెప్పాక చాలా బాగా అనిపించిందని, ఈ చిత్రం ద్వారా సమాజానికి మంచి సందేశం ఇస్తున్నారని అన్నారు. ఈ సినిమా విజయం సాధించాలని, జానకిరామ్ మంచి దర్శకుడిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.
జానకిరామ్ మాట్లాడుతూ, ‘తోలు బొమ్మల సిత్రాలు’ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం ట్రైలర్ ను తలసాని ఆవిష్కరించడం సంతోషంగా ఉందని చెప్పారు. సమాజంలో దేవుడు, దెయ్యం, సైన్స్ పై చాలా అనుమానాలు, అపోహలు ఉన్నాయని చెప్పారు. వాటి నిగ్గు తేల్చేందుకే దమ్మున్న కథతో సినిమా తీస్తున్నామని చెప్పారు. టాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు అనేక హర్రర్ సినిమాలు, దేవుళ్ళ సినిమాలు, సైన్స్ సినిమాలు వచ్చాయని, ఈ మూడింటిని కలగలిపి వీటిలో అసలు ఏది వాస్తవం? ఏది అబద్దం అనే విషయాన్ని ప్రేక్షకులకు చెప్పబోతున్నామని అన్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబరు 10న థియేటర్స్ లో చూసి ప్రేక్షకులు ఆదరిస్తారనే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘GST’లో ఆనంద్ కృష్ణ, అశోక్, వెంకట్, నందు, జూనియర్ సంపూ, స్వాతి మండల్, యాంకర్ ఇందు, పూజా, వాణి తదితరులు నటించారు.