
కాంగ్రెస్ కథ మళ్లీ మొదటికి వచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ నియమితులయ్యాక పరిస్థితిలో మార్పు వచ్చిందని పార్టీ శ్రేణులు భావించినా.. పెద్దగా తేడా మాత్రం కనిపించడం లేదు. దళిత, గిరిజన దండోరా సభలతో పార్టీ కేడర్ లో జోష్ వచ్చినా.. హుజూరాబాద్ అభ్యర్థిత్వంపై ఎటూ తేల్చకపోవడం గందరగోళానికి దారి తీస్తోంది. నేత మారినా పార్టీ రూపురేఖలు మారలేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా ఉప ఎన్నికలో పోటీ చేయాలనుకునే వారు దరఖాస్తు చేసుకోవాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రకటించడం మరో సారి చర్చనీయాంశంగా మారింది.
ఇప్పటికే హుజూరాబాద్ లో అధికార టీఆర్ఎస్ తోపాటు బీజేపీ.. రేసు గుర్రాల్లా పరిగెడుతున్నాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. దళితబంధు సహా కొత్తగా ప్రవేశపెడుతున్న పథకాలన్నీ తన రాజీనామా వల్లే వచ్చాయని ఈటల చెప్పుకొంటుండగా, అధికార పార్టీగా ప్రజల సంక్షేమమే తమ ధ్యేయమని టీఆర్ఎస్ ప్రచారం చేసుకుంటోంది. హుజూరాబాద్ లో హీట్ తారస్థాయిలో ఉన్నప్పటికీ.. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థినే ప్రకటించకపోవడం.. తాపీగా నిన్న దరఖాస్తులు ఆహ్వానించడంతో ఆ పార్టీ వర్గాలే నివ్వెరపోతున్నాయి.
వాస్తవానికి హుజూరాబాద్ లో మాజీ మంత్రి కొండా సురేఖను అభ్యర్థిగా ప్రకటించాలని భావించినా.. కొందరు సీనియర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలిసింది. దీంతో బీసీ సామాజిక వర్గానికి చెందిన సురేఖ పేరుతోపాటు మరో రెండు సామాజిక వర్గాలకు చెందిన వారి పేర్లతో రూపొందించిన నివేదికను అధిష్ఠానానికి టీపీసీసీ పంపింది. ఇంతలోనే ఏమైందో.. ఏమో తెలియదు కానీ మరో సారి దరఖాస్తులు ఆహ్వానించాలని నిన్నటి ముఖ్య నేతల సమావేశంలో నిర్ణయించింది. దరఖాస్తులు అందిన తర్వాత ఇంటర్వ్యూలు చేస్తామని ప్రకటించింది. దీనిపై పార్టీ వర్గాల నుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ఇప్పట్లో తేలే వ్యవహారం కాదని చర్చించుకుంటున్నాయి.