
రాష్ట్రంలో మిన్ను విరిగి మీద పడే దారుణ సంఘటనలు జరిగినా కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ తన నివాసం నుంచి బైటకు రారు. అది ఎర్రవెల్లి ఫాంహౌస్ కావచ్చు, హైదరాబాద్ లోని ముఖ్యమంత్రి అధికారిక నివాసం కావచ్చు. ముఖ్యమంత్రి బైటకు రావడం, లేదా జరుగుతున్న సంఘటనలకు స్పందించి మీడియాతో మాట్లాడటం చాలా అరుదు. ఇక రాష్ట్రం వెలుపల పర్యటనలంటే సీఎంకు అస్సలు ఇష్టముండదు. అలాంటిది మొన్న ఢిల్లీ పర్యటనలో ఆయన ఏకంగా తొమ్మిది రోజులు ఉన్నారంటే ఏదో పెద్ద సీక్రెట్ కచ్చితంగా ఉండి ఉంటుందని రాజకీయ పార్టీలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా అనుమానించారు.
టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం శంకుస్థాపన కోసం సీఎం కేసీఆర్ ఈ నెల 1న ఢిల్లీ వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు ఆయన కుమారుడు, రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్, ఇతర మంత్రులు, పార్టీ సీనియర్ నేతలు సైతం శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఈ నెల 2న అక్కడ కేసీఆర్ చేతుల మీదగా శంకుస్థాపన, పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఒక్క కేసీఆర్ తప్ప మిగిలిన వారందరూ రాష్ట్రానికి తిరిగి వచ్చారు. కేసీఆర్ మాత్రం సుదీర్ఘంగా తొమ్మిది రోజుల పాటు ఢిల్లీలో ఉండి ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమయ్యారు. రాష్ట్ర అవసరాలు, కేంద్రసాయంపై ప్రభుత్వ పెద్దలతో చర్చించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వ పెద్దలతో కేసీఆర్ సమావేశం కావడం నాణేనికి ఒక పార్శ్వం కాగా, మరో వైపు ఆయన కేటీఆర్‌ను సీఎం చేయడానికి కేంద్ర పెద్దలతో మాట్లాడి వచ్చారనే ప్రచారం టీఆర్ఎస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో దళిత బంధు ప్రయోగం కూడా అధికార పార్టీకి వర్కవుట్ అయ్యేలా లేదని సీఎం కేసీఆర్‌కు పక్కా సమాచారం ఉండడంతో, కేసీఆర్ స్కెచ్ మార్చారని గులాబీ నేతలు భావిస్తున్నారు. అయితే, హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలిచినా, ఓడినా రాష్ట్ర మంత్రి కేటీఆర్‌పై మచ్చ పడకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తగా ఆయనను ప్రచార బాధ్యతల నుంచి తొలగించారని అంటున్నారు. ఓడిపోయే సీటులో టీఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వానికి క్రెడిట్ ఇవ్వడం, ఓడిపోతే మంత్రి హరీశ్‌రావుని బాధ్యుడిని చేయడం సీఎం కేసీఆర్ లక్ష్యంగా కనిపిస్తోంది.
మంత్రి కేటీఆర్ కూడా ఈ ఉప ఎన్నికలపై లైట్ కామెంట్స్ చేశారు. ఈ ఒక్క సీటులో గెలుపోటములతో ప్రభుత్వానికి వచ్చే లాభనష్టాలు లేవని ప్రకటించారు. దీంతో, ఈ ఉప ఎన్నికల గెలుపు ఓటమితో సంబంధం లేకుండా కేటీఆర్‌ను సీఎం చేయడానికి వీలుగా కేంద్రంతో సీఎం కేసీఆర్ సంప్రదింపులు జరిపి వచ్చాడని, త్వరలో కేటీఆర్‌కు పట్టాభిషేకం ఖాయమని టీఆర్ ఎస్ నేతలు భావిస్తున్నారు. సీఎం కేసీఆర్ ఢిల్లీ టూర్ సీక్రెట్… కేటీఆర్‌ను సీఎం చేయడానికి లాబీయింగ్ కోసమేనని గులాబీ నేతలు గుసగుసలాడుతున్నారు.