
కేసీఆర్ ఢిల్లీ పర్యటన పరిణామాలతో అధిష్ఠానంపై రాష్ట్ర బీజేపీ నేతలు గుర్రుగా ఉన్నారు. తాము గల్లీలో కొట్లాడుతుంటే.. ఢిల్లీలో కేసీఆర్ కు సాదర స్వాగతం లభించడంపై అంతర్గతంగా పార్టీ పెద్దల తీరుపై మండిపడుతున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడిన తీరు.. నాయకులతోపాటు పార్టీ శ్రేణులను నిర్ఘాంతపరిచింది. కేంద్రం పెద్దలు.. రాష్ట్ర పథకాలపై ప్రశంసలు గుప్పించడం.. రాష్ట్రంలో పార్టీకి ఎదురు దెబ్బేనని ఆ వర్గాలు భావిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఈ నెల 17న హోం మంత్రి అమిత్ షా.. రాష్ట్ర పర్యటనకు రానుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. నిర్మల్ లో నిర్వహించనున్న సభలో ఆయన ఏం చెప్పబోతున్నారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్త పాదయాత్ర ప్రారంభించారు. టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, ఉద్యోగ నియామకాలే లక్ష్యంగా తన యాత్ర సాగుతుందని ఆయన పేర్కొన్నారు. మరోవైపు హుజూరాబాద్ లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూ.. టీఆర్ఎస్ తీరును ఎండగడుతున్నారు. ఉప ఎన్నికలో తన విజయం ఖాయమని ధీమాగా చెబుతున్నారు. బీజేపీ శ్రేణులన్నీ.. తరచూ టీఆర్ఎస్ పై ఎదురుదాడికి దిగుతూనే ఉన్నాయి. కానీ, ఢిల్లీలో ఇందుకు విరుద్ధంగా పరిస్థితి కనిపించింది. టీఆర్ఎస్ భవన్ కు శంకుస్థాపన పేరిట ఢిల్లీ చేరుకున్న సీఎం కేసీఆర్.. ఏకంగా పది రోజుల పాటు అక్కడే ఉండడం సంచలనం సృష్టించింది. ప్రధాని మోదీతోపాటు అమిత్ షా, ఇతర కేంద్ర మంత్రులను కలవడం.. పలు హామీలు పొందామంటూ పార్టీ వర్గాల ద్వారా ప్రచారం చేయించుకోవడం..రాష్ట్రంలోని కాషాయ దళానికి మింగుడు పడలేదు.
బీజేపీ అధిష్ఠానంపై ఒకింత అసహనంతో ఉన్న శ్రేణులను నూతనోత్సాహంతో ముందుకు తీసుకెళ్లేందుకు నిర్మల్ సభను వినియోగించుకునేందుకు కసరత్తు జరుగుతోంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఉద్యమ సమయంలో పట్టుపట్టిన కేసీఆర్.. అధికారంలోకి వచ్చి ఏడేళ్లు దాటినా ఎందుకు నిర్వహించడం లేదో? చెప్పాలన్న డిమాండ్ ను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ భావిస్తోంది. ఇందుకోసం ఏకంగా బీజేపీ అధిష్ఠానం రంగంలోకి దిగాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నిర్మల్ బహిరంగ సభ వేదికగా టీఆర్ఎస్ విషయంలో పార్టీ వైఖరిని స్పష్టం చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. గులాబీ దళంతో ఎలాంటి దోస్తానా ఉండబోదని, ఆ పార్టీకి తాము ఎప్పటికీ బలమైన ప్రత్యర్థిమేనని సంకేతాలిచ్చే విధంగా అమిత్ షా ప్రకటన చేసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలోనే కేసీఆర్ తో మాట్లాడమే తప్ప.. రాజకీయ ఉద్దేశాలు లేవని స్పష్టత ఇవ్వనున్నట్లు తెలిసింది.