
హుజురాబాద్ ఎలక్షన్ నేపథ్యంలో టీఅర్ఎస్ ప్రభుత్వం ‘దళిత బంధు’ పైలట్ ప్రాజెక్ట్ గా ప్రవేశ పెట్టింది. అందుకు అనుగుణంగా దళితబంధు ప్రాజెక్టుకు మరో 500 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. నిధుల విడుదలపై ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తొలివిడతగా ఇప్పటికే 500 కోట్లు విడుదల చేసిన ప్రభుత్వం…ఇప్పుడు మరో 500 కోట్లు విడుదల చేసింది. ఒక్క హుజూరాబాద్‌లో నే మొత్తం దళితబంధుకు దాదాపు వెయ్యికోట్లు కేటాయించింది. వారంలో మరో వెయ్యి కోట్లు విడుదల చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. దళితబంధు అమలును తెలంగాణ ప్రభుత్వం చాలా సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే హుజూరాబాద్‌లో పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు సీఎం కేసీఆర్. ఈ పథకం కింద ఒక్కో లబ్దిదారుడికి పది లక్షలు నేరుగా ఇస్తుంది ప్రభుత్వం. వాటి ద్వారా ఉపాధి అవకాశాలు చూపుతుంది.
దళితబంధు అనేది ఓ పథకం కాదు.. ఇది ఓ ఉద్యమం అంటున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఉత్పాదక రంగానికి ఇంతకాలం దూరంగా ఉన్న వర్గాలను కూడా రాష్ట్ర ఆర్ధికాభివృద్ధిలో భాగస్వాములు చేసేలా పథకం అమలు చేస్తామంటున్నారు సీఎం. ఈ స్కీమ్ ప్రకటించిన రోజు నుంచే మద్దతు అనూహ్యంగా పెరుగుతోంది. కాళ్లు, రెక్కలు మాత్రమే ఆస్తులుగా కలిగిన దళిత కుటుంబాలే మొదటి ప్రాధాన్యతగా దళిత బంధు పథకం రాష్ట్రవ్యాప్తంగా, అర్హులైన దళితులందరికీ అమలు చేస్తామని, దశలవారీగా అమలు చేసే ఈ పథకం కోసం రూ. 80 వేల కోట్ల నుంచి రూ. లక్ష కోట్ల వరకు ఖర్చు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. దళితబంధు కేవలం తెలంగాణలో మాత్రమే కాకుండా యావత్ దేశానికి ఆదర్శంగా నిలవనుందన్నారు. దేశంలోని దళితులందరినీ ఆర్ధిక, సామాజిక వివక్షల నుంచి విముక్తులను చేసే పథకంగా మారాలని సీఎం ఆకాంక్షించారు.