
నిజామాబాద్ జిల్లాలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఆర్మూరు ఎమ్మెల్యే ఎ.జీవన్ రెడ్డి, నిజామాబాద్ ఎంపీ అర్వింద్ మధ్య సవాళ్ల పర్వం హాట్ టాపిక్ గా మారింది. మిస్టర్ ఎంపీ.. తనపై పోటీ చేసే దమ్ముందా? అని జీవన్ రెడ్డి ప్రశ్నిస్తే.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి మళ్లీ సీఎం కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పోటీ చేస్తానంటే తానూ సిద్ధమేనని అర్వింద్ వ్యాఖ్యానించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఆర్మూర్ లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అర్వింద్ గుండాలా, వీధిరౌడీగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పోలీస్ స్టేషన్ నే కూలగొడతానని మాట్లాడడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ప్రతి నిమిషం ప్రజలను కాపాడుతున్న పోలీసులపై నిందలు వేయడం తగదని హితవు చెప్పారు. దమ్ముంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. పసుపు బోర్డు తీసుకురాని ఎంపీకి.. టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌పై మాట్లాడే హక్కే లేదని స్పష్టం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే భవిష్యత్తులో ప్రజలు తరిమి కొడతారని హెచ్చరించారు. డి.శ్రీనివాస్ అంటే తనకు ఎంతో గౌరవమని చెప్పారు. కానీ, ఒకే ఇంట మూడు పొయ్యిలు పెట్టుకున్న కుటుంబం.. కేసీఆర్ వ్యంగ్యంగా మాట్లాడడం ఏంటని నిలదీశారు ఎంపీ అర్వింద్‌పై ప్రధాని మోదీకి, అమిత్‌షాకు త్వరలోనే లేఖ రాస్తానని తెలిపారు. ఎంపీని త్వరలోనే అరెస్టు చేసి తీహార్ జైలుకు పంపడం ఖాయమన్నారు.
ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి సవాల్‌పై ఎంపీ అర్వింద్ స్పందించారు. ఆయన కోరిక మేరకు ఆర్మూర్ నుంచి పోటీచేసి గెలుస్తానని చెప్పారు. అయితే, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా కల్వకుంట్ల కవిత పోటీ చేసేలా ఒప్పించాలని సూచించారు. తన కోరికను ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి మన్నించాలని విజ్ఞప్తి చేశారు.