
తెలంగాణలో బీజేపీ, టీఆర్ఎస్ అంతర్గతంగా కుమ్మక్కై ప్రజలను మోసం చేస్తున్నాయని కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్ ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ..రాష్ట్రంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శించారు. మంత్రి గంగుల కమలాకర్ అక్రమంగా తవ్వకాలు జరుపుతూ.. ప్రకృతి వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. కోట్లాది రూపాయలు దండుకుంటూ.. పన్నులు ఎగ్గొడుతున్నా ఈడీ చర్యలు తీసుకోకపోవడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. ఎంపీ బండి సంజయ్ కు చిత్తశుద్ధి ఉంటే గ్రానైట్ స్కాంపై లిఖితపూర్వకంగా అమిత్ షాకు ఫిర్యాదు చేయాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు చేస్తున్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ధ్వజమెత్తారు. బండి సంజయ్ మాటలన్నీ ఆరోపణలకే పరిమితమన్న మాణిక్కం.. బండి సంజయ్ పాదయాత్రతో ఎవరికీ లాభం లేదన్నారు.
“రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. 78 సీట్లు గెలిచేలా కార్యకర్తలంతా కృషి చేయాలి. తెలంగాణ అమరవీరుల త్యాగాలను గుర్తించి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది సోనియా గాంధీ. రాబోయే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తెస్తాం” అని మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు.