
తెలంగాణలో నిరుద్యోగులకు ఇది నిజంగా షాకింగ్ న్యూసే. టీచర్ పోస్టుల భర్తీ కోసం అభ్యర్థులకైతే అశనిపాతమే. టీచర్ల నియామకాల సంగతేమో కానీ.. రాష్ట్రంలో ఇప్పటికే 3వేల పోస్టులు అదనంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. రాష్ట్రంలో నిర్వహిస్తున్న రేషనలైజేషన్ ప్రక్రియ తర్వాత ఈ విషయం వెల్లడైంది. సుమారు 1600 పాఠశాలల్లో విద్యార్థుల నమోదే లేదని తెలిసింది. ఈ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్ పోస్టులను ఇతర స్కూళ్ల పరిధిలోకి మార్చాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. రాష్ట్రంలోని కొన్ని బడుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, తక్కువ మంది టీచర్లు ఉండగా, మరికొన్ని పాఠశాలల్లో విద్యార్థులు తక్కువగా, టీచర్లు ఎక్కువగా ఉన్నారు. దాంతో రేషనలైజేషన్ ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. త్వరలోనే దీనికి సంబంధించిన నివేదికను పాఠశాల విద్యా శాఖ అధికారులు ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం రాష్ట్రంలోని 1 నుంచి 5వ తరగతులకు సంబంధించిన ప్రాథమిక స్కూళ్లలో విద్యార్థులు లేని పాఠశాలల సంఖ్య 1231 వరకు ఉంది. ఈ బడుల్లో సుమారు 1500 టీచర్లు పనిచేస్తున్నారు. అలాగే ప్రాథమికోన్నత స్థాయిలో 10 స్కూళ్లల్లో, హైస్కూల్ స్థాయిలో మరో 10 పాఠశాలల్లో, ప్రాథమిక స్థాయిలో సుమారు 340 పాఠశాలల్లో విద్యార్థులు లేరని గుర్తించారు. ఇలా ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాలల వరకు జీరో ఎన్రోల్మెంట్ ఉన్న ప్రాంతాల్లో సుమారు మూడు వేలకుపైగా టీచర్ పోస్టులు ఉన్నాయని సమాచారం. రేషనలైజేషన్ ప్రక్రియ అనంతరం పదోన్నతులు, బదిలీలు చేపట్టనున్నారు. ఇప్పుడు పనిచేస్తున్న టీచర్లందరినీ ఏదో ఒక బడిలో సర్దుబాటు చేయనున్నారు. అప్పటికీ అదనంగా టీచర్లు ఉంటే వారిని డీఈవో పరిధిలోకి తీసుకురానున్నారు. భవిష్యత్తులో ఎక్కడైనా విద్యార్థుల సంఖ్య పెరిగి, అదనపు టీచర్ కావాల్సి వస్తే డీఈవో వద్ద ఉన్న వారిని సదరు స్కూల్కు పంపిస్తారు.
కొన్ని రోజుల క్రితం 50వేల పోస్టులు భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారు. బీఈడీ, టీటీసీ పూర్తి చేసిన వేలాది మంది టీచర్ పోస్టుల భర్తీ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లాల వారీగా టీచర్ పోస్టుల లెక్కలు తీసేందుకే ఇటీవల రేషనలైజేషన్ చేపట్టారు. అది చివరికి చేరుకోగా.. అసలు ఖాళీలే లేవని తేలింది. పైగా అదనంగా టీచర్లు ఉన్నట్లు స్పష్టమైంది. ఈ లెక్కన.. మరికొన్ని ఏళ్ల పాటు టీచర్ పోస్టుల భర్తీ ఉండకపోవచ్చని తెలుస్తోంది.