
తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం దళిత వాదం చుట్టూ తిరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన దళిత బంధు పథకం.. మొత్తం రాజకీయ వాతావరణాన్నే మార్చేసింది. అన్ని పార్టీలూ దళితులను ఆకట్టుకునేందుకు పోటీలు పడుతున్నాయి. కేసీఆర్.. మా వల్లే దళిత బంధు ప్రకటించారని కొందరు అంటుంటే.. ఈ పథకాన్ని బీసీలకు, మైనార్టీలకూ వర్తింపజేయాలని మరికొందరు డిమాండ్ చేస్తున్నారు. దళితులందరికీ ‘బంధు’ వర్తింపజేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తుండగా.. వీటన్నింటికీ కేసీఆర్ కూడా దీటుగా సమాధానం ఇస్తున్నారు. దళితులందరికీ ఈ పథకాన్ని వర్తింపజేస్తామంటున్న ఆయన.. ఆర్థికం అనుకూలిస్తే.. బీసీలు, మైనార్టీలకు కూడా ‘బంధు’ ప్రకటిస్తామని చెబుతున్నారు. ఆచరణలో సాధ్యాసాధ్యాలను పక్కనబెడితే.. ఎవరికి వారు రాజకీయ లబ్ధి పొందేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారన్నది మాత్రం వాస్తవం.
ఈ నేపథ్యంలో.. ఎన్నికలకు రెండేళ్ల ముందుగానే తెలంగాణ రాజకీయం వేడెక్కింది. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకానికి ఇప్పటికే శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. ఇప్పుడు దీనికో చైర్మన్ ను నియమించే దిశగా కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అభ్యర్థిత్వాన్ని కేసీఆర్.. తీవ్రంగా పరిశీలిస్తున్నట్లు సమాచారం. మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఆయన్ను.. పార్టీలోకి తీసుకుని ఈ కీలకమైన బాధ్యతలు అప్పగించేందుకు కేసీఆర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీలో ఉన్నప్పటి నుంచే మోత్కుపల్లి, కేసీఆర్ మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. మోత్కుపల్లి నిజాయితీ గల వ్యక్తని, ఆయనకు దళిత బంధు చైర్మన్ బాధ్యతలు అప్పగిస్తే.. ప్రభుత్వ ప్రతిష్ఠ ఇనుమడిస్తుందని కేసీఆర్ నమ్మకం. ఇటీవల జరిగిన దళిత బంధు సమీక్ష సమావేశంలోనూ మోత్కుపల్లికి కేసీఆర్.. అధిక ప్రాధాన్యం ఇచ్చారు. తన పక్కనే కూర్చోబెట్టుకోవడం ద్వారా.. దళిత బంధుకు కాబోయే చైర్మన్ ఆయనేనన్న సంకేతాలిచ్చారని పరిశీలకులు భావిస్తున్నారు.
గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన మోత్కుపల్లి.. 2019 ఎన్నికలకు ముందు టీడీపీని వీడారు. మధ్యలో ఓ సారి కాంగ్రెస్ లోకి వెళ్లినప్పటికీ.. అక్కడ ఇమడలేక.. మళ్లీ టీడీపీ గూటికే చేరారు. ఆ తర్వాత మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో బీజేపీలోకి వెళ్లిన ఆయన.. ఇటీవలే ఆ పార్టీకి రాజీనామా చేసి.. టీఆర్ఎస్ పిలుపు కోసం వేచి చూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. సీఎంను ఏకంగా అంబేడ్కర్ కంటే గొప్పవాడిగా కీర్తించారు.