
కేసీఆర్ ఢిల్లీ పర్యటన బీజేపీలో ముసలం రేపుతోంది. టీఆర్ఎస్, బీజేపీ గల్లీలో కుస్తీ.. ఢిల్లీలో దోస్తీ అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నట్టుగానే ఇక్కడి పరిణామాలు జరుగుతుండడం రాష్ట్రంలోని కాషాయ పార్టీ నేతల కు మింగుడు పడడం లేదు. టీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చి, కొంచెం అయిష్టంగానే కాషాయ పార్టీ లో చేరిన ఈటెలకు ఇది తలనొప్పి యవ్వారం గా మారింది. ఈ నెల 1న ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ …3వ తేదీన ప్రధాని మోదీని కలవడం, ఆ వెంటనే హుజూరాబాద్ ఉప ఎన్నిక వాయిదా పడడం కాకతాళీయమే అయినా… ఇది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. హుజూరాబాద్ లో ఓడిపోతారన్న భయంతోనే కేసీఆర్ ఉప ఎన్నికలను వాయిదా వేయించారంటూ బీజేపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. అంతర్గతంగా కొన్ని ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అక్కడ బీజేపీ గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఉప ఎన్నికను వాయిదా వేయడంలో ఆంతర్యం ఏమిటన్న వాదన వినిపిస్తోంది.
వాస్తవానికి బీజేపీతో టీఆర్ఎస్ దోస్తీ పై మొదటి నుంచి ఈటెలకు అనుమానాలు ఉన్నాయి. అందుకే పార్టీలో చేరేటప్పుడే అధిష్ఠానం పెద్దలతో ఈ విషయమై చర్చించారు. రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లోనూ గులాబీ దళం తో దోస్తీ ఉండదని, అతా కుస్తీయేనని వారు స్పష్టం చేసిన తర్వాతే చేరికపై నిర్ణయం తీసుకున్నారు. ఆయనకు మరో గత్యంతరం లేకపోవడం మరో కారణమైంది. హుజురాబాద్ ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాకముందే ప్రచార పర్వం లోకి దూకిన ఆయన టీఆర్ఎస్ తో సై అంటే సై అన్నట్టు వ్యవహరించారు. తనను అన్యాయంగా వెళ్లగొట్టారంటూ ప్రజల ఎదుట కన్నీరు పెట్టుకున్నారు. కేసీఆర్, హరీశ్ రావు పోటీ చేసినా గెలుపు తనదేనన్న ధీమాతో ఉన్నారు. గెలుపు నల్లేరు మీద నడకేనని అనుకున్నారు. కానీ, ఇప్పుడు పరిస్థితి రివర్స్ అయింది. ఆయన ముందు ముళ్ల బాటే కనిపిస్తోంది. ఎన్నిక వాయిదా పడిన నేపథ్యంలో మరో మూడు నెలలు ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. అప్పటిదాకా కిం కర్తవ్యం ఏంటి? ప్రచారంలో దూకుడు పెంచడమా?తాత్కాలికంగా విరమించుకోవడమా? లేదా కాస్త స్పీడ్ తగ్గించడమా? అన్న సంశయం నెలకొంది. తాను ఏ పార్టీ నేత తోనైతే కొట్లాడుతున్నాడో.. ఆయనే బీజేపీ పెద్దలను కలవడం, ఏకంగా వారం రోజుల పాటు ఢిల్లీలో మకాం వేయడం… ఈటెలకు ఇబ్బందికరంగా పరిణమించింది.
కేసీఆర్ ఎత్తులు, వ్యూహాలు ఈటలకు తెలియనివి కాదు. చివరి క్షణంలోనైనా ఏదో ఒకటి చేస్తారని ఆయన మొదటి నుంచి అంచనా వేస్తున్నారు. అయితే, ఇంకా ఎన్నిక దాకా వెళ్లకముందే సీఎం చేపట్టిన ఢిల్లీ టూర్.. హుజూరాబాద్ పై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. పశ్చిమ బెంగాల్ లో ఉప ఎన్నిక నిర్వహణకు ఓకే చెప్పిన ఈసీ.. హుజూరాబాద్ కు నో చెప్పడం.. ఈటెలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇక, రేపో.. మాపో ఎన్నికే అన్నట్టుగా సాగిన ప్రచార పర్వం సాగించిన రాజేందర్.. తాజా ఉదంతంతో ఆలోచనలో పడినట్లయింది. నిజంగా ఈటెలను గెలిపించుకోవాలన్న ఉద్దేశం బీజేపీ కి ఉంటే ఉపఎన్నిక షెడ్యూల్ వచ్చి ఉండేదని ఆయన వర్గీయులు చర్చించుకుంటున్నారు.
ఇప్పటికే బీజేపీలో ఎవరూ తనతో కలిసి రావడం లేదన్న అసహనం ఈటెలలో ఉంది. ఒక వైపు బండి సంజయ్.. ప్రజా సంగ్రామ యాత్ర చేస్తూ హుజూరాబాద్ వైపు తొంగి చూడటం లేదు. జితేందర్ రెడ్డి మినహా మిగతా ముఖ్య నేతలెవరూ ఇప్పటిదాకా అక్కడికి వెళ్లనే లేదు. అయినా.. ఎలాగోలా నెట్టుకొస్తున్న తరుణంలో చోటుచేసుకున్న తాజా ఉదంతం.. నియోజకవర్గంలో ఆయన స్పీడ్ కు బ్రేక్ వేసింది. అదే సమయంలో టీఆర్ఎస్ కు కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇది ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పరిస్థితి చేయి దాటి పోయే ప్రమాదం ఉందని ఈటెల అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఏదేమైనా ఢిల్లీలో కేసీఆర్ మొదలు పెట్టిన మైండ్ గేమ్.. హుజూరాబాద్ లో ఈటెల మైండ్ బ్లాక్ చేస్తుంది.