
సీఎం కేసీఆర్‌ను ఢీ కొట్టేదీ, టీఆర్ఎస్ పార్టీని తరిమికొట్టేదీ బీజేపీ… కేసీఆర్ ప్లాన్ బీగా కాంగ్రెస్ పార్టీ తయారైంది… అంటూ గత కొద్ది రోజులుగా బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంపై టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఎదురుదాడి ప్రారంభించారు. ఈ ప్రచారానికి తన స్టైల్లో అడ్డుకట్ట వేయడానికి రివర్స్ స్ట్రాటజీ ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ కోవర్టులు ఉన్నట్టుగానే, బీజేపీలో కూడా సీఎం కోవర్టులు ఉన్నారని ప్రకటించారు. బీజేపీలో టీఆర్ఎస్ అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్నాయని అన్నారు. హుజూరాబాద్‌లో బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోటీచేయడం వెనుక కూడా సీఎం కేసీఆర్ హస్తముందని రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఈటలను కలుసుకోవడానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వచ్చిన ప్రైవేట్ హెలికాఫ్టర్‌ను ఏర్పాటు చేసింది కూడా ముఖ్యమంత్రేనని రేవంత్ బీజేపీపై మరో బాంబు పేల్చారు. రేవంత్ రెడ్డి రివర్స్ స్ట్రాటజీ కారణంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి.
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాత్రమే పోటీ ఉందనే అభిప్రాయం ఇప్పటి వరకు స్థానిక నేతలు, కార్యకర్తల్లో ఉంది. అయితే రేవంత్ రెడ్డి పార్టీ అధ్యక్ష పగ్గాలు స్వీకరించిన తర్వాత కాంగ్రెస్ వ్యూహాలను ఎప్పటికప్పుడు మారుస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా దీక్షలతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పలు ఉద్యమాలు, ధర్నాలు చేపట్టారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులను గుర్తించి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కూడా గట్టి పోటీనిస్తుందని రేవంత్ ప్రకటించారు. దీంతో ఉప ఎన్నిక మూడు పార్టీల నేతల మధ్య ముక్కోణపు పోటీగా మారింది. రేవంత్ పాటిస్తున్న రివర్స్ స్ట్రాటజీ కారణంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఫలితం ఎవరిదనే అంశంపై ఆసక్తి పెరుగుతోంది.