
నాలుగేళ్లు కాదు కదా.. నలభై ఏళ్లయినా దళితులందరికీ ఇచ్చేంత సొమ్ము ప్రభుత్వం దగ్గర లేదని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. దళిత బంధు పథకం రావడానికి ఈటల రాజేందరే కారణం అంటూ.. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో దళిత సంఘాలు ఆత్మీయ సన్మాన సభ ఏర్పాటు చేశాయి. ఈ కార్యక్రమంలో మాట్లాడిన ఈటల.. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. ‘‘ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంతో చెబుతున్నా.. ఈ ప్రభుత్వం దగ్గర చిల్లిగవ్వ లేదు. నిజంగా అంత డబ్బే ఉంటే మధ్యాహ్న భోజనం నిర్వాహకులకు బిల్లులు, కాంట్రాక్టు వర్కర్లు, ఇతర వర్కర్లకు జీతాలు ఎందుకు ఇవ్వలేక పోతోంది? నాలుగేళ్లు కాదు కదా.. నలభై ఏళ్లు అయినా దళితులందరికీ ఇచ్చేంత డబ్బు ఈ ప్రభుత్వం దగ్గర లేదు…’’ అని తేల్చి చెప్పారు.
హుజూరాబాద్ లో ఇప్పటికే రూ. 192 కోట్లు ఖర్చు చేశారని, ఇంకో నాలుగు, ఐదు వందల కోట్లు ఖర్చు చేస్తారని చెబుతున్నారని ఈటల ఆరోపించారు. ఇంత డబ్బు కేసీఆర్ కు ఎక్కడిదని ప్రశ్నించారు. పోరాటం చేసిన వాళ్లనే ప్రజలు గుర్తుంచుకుంటారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చినప్పటికీ.. పోరాటం చేసిన టీఆర్ఎస్ కే తెలంగాణ తెచ్చిన ఘనత దక్కిందని గుర్తు చేశారు. దళిత బంధు విషయంలోనూ పోరాటం చేస్తున్న మనకే పేరు వస్తుంది తప్ప కేసీఆర్ కు రాదని చెప్పారు.