
తెలంగాణలో అన్ని రకాల విద్యాసంస్థలను సెప్టెంబర్ 1వ తేదీ నుంచి తెరవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం కేసీఆర్ అంగన్వాడీలతో సహా అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీల్లో ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభించాలని ఆదేశించారు. గ్రామాలు, పట్టణాల్లోని అన్ని విద్యాసంస్థలు, వసతి గృహాలను ఈ నెల 30లోగా శానిటైజ్ చేయాలని పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖల మంత్రులు, అధికారులకు సూచించారు.
కరోనా నేపథ్యంలో మూతపడిన విద్యాసంస్థల పునఃప్రారంభంపై సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతిభవన్‌లో వివిధశాఖల ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. విద్యాసంస్థలు తెరిచిన తర్వాత విద్యార్థులకు జ్వరం తాలూకు లక్షణాలంటే, ఆయా స్కూళ్ల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు వెంటనే దగ్గర్లోని పీహెచ్‌సీకి తీసుకెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఒకవేళ కరోనా సోకినట్టు తేలితే ఆయా విద్యార్థులను తల్లిదండ్రులకు అప్పగించాలని సూచించారు. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవడం, మాస్కులను ధరించడం వంటి కరోనా నియంత్రణ చర్యలను విధిగా పాటించాలని విద్యార్థులకు సూచించారు. ప్రతిరోజూ పిల్లలు మాసులు ధరించేలా, కరోనా నియంత్రణ చర్యలు పాటించేలా జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులను కోరారు.
అలాగే వానకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు నియంత్రణ చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. అనుమానితులకు తక్షణమే పరీక్షలు చేయించాలని, అందుకు ఆస్పత్రుల్లో తగిన ఏర్పాట్లుచేయాలని వైద్యశాఖ అధికారులను ఆదేశించారు. పరిసరాల పరిశుభ్రతను కాపాడే చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, మున్సిపల్‌శాఖ అధికారులకు సూచించారు. దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ అమలుచేయాలన్నారు.