
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు కోడింగ్ నేర్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ప్రస్తుత సాంకేతిక యుగంలో కోడింగ్ కు ఎంతో ప్రాధాన్యం ఏర్పడింది. సాఫ్ట్ వేర్ ఉద్యోగాలకే కాకుండా మరెన్నో ఇతర రంగాల్లో స్థిరపడాలనుకునే యువతకు కోడింగ్ తప్పనిసరి. ఎంతో మంది యువత ఉద్యోగసాధనలో భాగంగా నైపుణ్యాలు నేర్చుకుంటున్నారు. తెలంగాణ విద్యాశాఖ, లెర్నింగ్ లింక్స్ ఫౌండేషన్ (ఎల్ఎల్ఎఫ్), డెల్ టెక్నాలజీస్ సంయుక్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు కోడింగ్ నైపుణ్యాలపై శిక్షణ ఇవ్వనున్నాయి. విద్యార్థుల్లోని సృజనాత్మకశక్తిని వెలికితీసేందుకు వీలుగా ‘స్టెమ్’(సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్) ఆధారిత ప్రయోగాలు చేపట్టేందుకు ప్రత్యేకంగా కిట్లు అందించనున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ‘స్టెమ్’ ఆధారిత ప్రయోగాలు చేపట్టేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. ఇందులో వివిధ స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్ కంపెనీల భాగస్వామ్యం తీసుకుంటుంది. తాజాగా ఎల్ ఎల్ ఎఫ్, డెల్ సాయంతో రోబోటిక్స్, ఎల్ ఈడీ, ట్రాన్సిస్టర్స్ నమూనాల తయారీలో విద్యార్థులతో ప్రయోగాలు చేయించనున్నారు. ప్రతివారం ఎల్ ఎల్ ఎఫ్ రిసోర్స్ పర్సన్లు పాఠశాలలను సందర్శించి కార్యక్రమాలను పర్యవేక్షించనున్నారు. ఎంపిక చేసిన ప్రతి పాఠశాలకు ప్రయోగాలకు అవసరమైన కిట్లను ఆయా సంస్థలు అందించనున్నాయి. వాటి సాయంతో విద్యార్థులు నిత్య జీవితంలోనే కాక సమాజపరంగా ఎదురయ్యే సవాళ్లకు పరిష్కారాలు కనుగొనేందుకు వినూత్న మార్గాల్లో ప్రయోగాలు చేస్తారు. దీనివల్ల విద్యార్థుల్లోనూ సృజనాత్మకత పెరుగుతుందని విద్యాశాఖాధికారులు చెబుతున్నారు.
కోడింగ్ తోపాటు ప్రయోగాలు చేయించేందుకు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని 50 ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో రెండు జిల్లాల్లో చెరో 20 చొప్పున ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, మరో పది తెలంగాణ రాష్ట్ర మైనార్టీ రెసిడెన్షియల్ బడులున్నాయి. వాటిల్లో చదివే ఆరు నుంచి పదో తరగతి పరిధిలోని 20 వేల మంది విద్యార్థులకు తర్ఫీదు ఇవ్వనున్నారు.