
‘‘ఇన్నేళ్లుగా కొత్త పెన్షన్ ల ఊసెత్తని వాళ్లు.. ఇప్పుడెలా ఇస్తున్నారు. డప్పు చాటింపు వేసి మరీ ఇస్తున్నారు. సిద్దిపేట నాయకుడు ఇక్కడకు వచ్చి పెన్షన్ పైసలు చేతిలో పెట్టి మరీ లబ్ధిదారుల కాళ్లు మొక్కుతున్నారు. నా దెబ్బకు కేసీఆర్ దిమ్మ తిరిగింది. నా రాజీనామా దెబ్బ ఎంత పనిచేసిందో ప్రజలు తెలుసుకోవాలి’’ అని బీజేపీ నేత ఈటల రాజేందర్ అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో వివిధ పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడారు. ఒకప్పుడు పెన్షన్ దరఖాస్తు కమిషనర్ కు ఇస్తే.. ఆయన ప్రభుత్వానికి పంపేవారని, నెల రోజుల్లో పెన్షన్ మంజూరయ్యేదని చెప్పారు.
కానీ, ఇప్పుడు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వంలో.. కౌన్సిలర్ నుంచి మంత్రుల వరకు ఎంతమందికి దరఖాస్తులు ఇచ్చినా.. పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రజలు అలసిపోయి పెన్షన్ మాట మరచిపోవాల్సి వస్తోందని ఎద్దేవా చేశారు. పెన్షన్ కోసం నేరుగా ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లినా పనులు కావడం లేదన్నారు. కానీ, తన రాజీనామాతో పరిస్థితులు మారిపోయాయని, ఎప్పుడూ కనిపించని మంత్రులు కూడా ప్రజల కాళ్లు మొక్కి మరీ పెన్షన్ పైసలు ఇస్తున్నారని చెప్పారు. అలాగే, ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న రేషన్ కార్డులు కూడా ఇప్పుడు మంజూరు చేసేస్తున్నారని హర్షం వ్యక్తం చేశారు. నిజంగా ఇప్పుడు తన రాజీనామాకు సార్థకత చేకూరిందని అన్నారు.