
తెలంగాణలో నేరాలు పెరుగుతున్నాయి. నేరాల సంఖ్య.. 2020లో ఏకంగా 12 శాతం పెరిగింది. నేర నియంత్రణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నప్పటికీ.. నేరాల సంఖ్య ఈ స్థాయిలో పెరగడం.. పోలీసు వర్గాలనే విస్మయపరుస్తోంది. నేషనల్ క్రైమ్ రిజిస్టర్ బ్యూరో (ఎన్సీఆర్బీ) ‘క్రైమ్ ఇన్ ఇండియా’ 2020 పేరిట విడుదల చేసిన తాజా నివేదికలో పలు దిగ్భ్రాంతికర విషయాలు వెల్లడయ్యాయి. 2018లో రాష్ట్రవ్యాప్తంగా 1,26,858 నేరాలు నమోదుకాగా.. 2019లో ఆ సంఖ్య కొంచెం పెరిగి 1,31,254కి చేరింది. తాజాగా 20220లో ఆ సంఖ్య 12 శాతం పెరిగి 1,47,501కి చేరడం గమనార్హం. వీటిలో చార్జిషీట్ల నమోదు శాతం 83.7గా ఉంది.
రాష్ట్రంలో సరాసరిన ప్రతి లక్ష మంది జనాభాకి 393 కేసులు నమోదవుతున్నాయి. గతేడాది హత్య కేసులు 802 నమోదుకాగా.. 827 మంది హత్యకు గురయ్యారు. అంటే.. ప్రతి లక్ష మందిలో ఇద్దరు హత్యకు గురయ్యారు. అలాగే, మితిమీరిన నిర్లక్ష్యమూ అధిక మరణాలకు కారణమవుతోంది. ఈ కారణంగా ఒక్క ఏడాదిలో 7,564 మంది మృత్యువాత పడ్డారు. రోడ్డు ప్రమాదాలపై పోలీసులు ఎన్ని అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నా.. ఫలితం ఉండడం లేదు. 2020లో 6,288 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 7,226 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. హిట్ అండ్ రన్ కేసులు 1,332 నమోదవగా.. 1,365 మంది మరణించారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల 16 మంది రోగులు మృతి చెందారు. ఐదుగురు మహిళలు యాసిడ్ దాడికి గురవగా.. పని ప్రదేశాల్లో 18 మంది మహిళలపై లైంగిక వేధింపుల ఘటనలు జరిగాయి.
సోషల్ మీడియాలో వదంతులు, అసత్య ప్రచారాల వ్యాప్తి తదితరాలకు సంబంధించి 273 కేసులు రిజిస్టర్ అయ్యాయని ఎన్సీఆర్బీ తెలిపింది. 12 మానవ అక్రమ రవాణా కేసులతో పాటు పోక్సో చట్టం కింద 2,074 కేసులు నమోదయ్యాయి. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద 117 కేసులు, గ్యాంబ్లింగ్ కు సంబంధించి 2,643 కేసులు నమోదయ్యాయి. అలాగే, రెండు రాజద్రోహం కేసులతో పాటు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనల కేసులు 65, ఆహార పదార్థాల కల్తీకి సంబంధించి 1,498 కేసులు నమోదయ్యాయని ఎన్సీఆర్బీ వెల్లడించింది.