
దళిత దండోరా సభలతో బిజీబిజీగా ఉన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సొంత పార్టీలో లుకలుకలు ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటిదాకా మూడు దళిత దండోరా సభలు నిర్వహించగా.. ఒక్క దానికి కూడా ఎంపీలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరు కాకపోవడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడానికి సహకారం అందించాల్సిన సీనియర్లే.. ఇలా వ్యవహరించడాన్ని పార్టీ శ్రేణులు సైతం తప్పుపడుతున్నాయి. ఇటీవల గజ్వేల్ లో నిర్వహించిన దళిత దండోరా సభకు హాజరైన కాంగ్రెస్ ముఖ్య నేత మల్లికార్జున ఖర్గే దృష్టికి కొందరు నాయకులు ఈ విషయాన్ని తీసుకెళ్లారు. రాహుల్ గాంధీకి సన్నిహితుడిగా పేరున్న ఒక ముఖ్య నేత సైతం ఈ విషయమై అధిష్ఠానానికి మెయిల్ పెట్టారు. దీంతో ఈ అంశాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం సీరియస్ గా తీసుకుంది. వరుసగా మూడు సభలకు వారు ఎందుకు హాజరు కాలేకపోయారని ఆరా తీస్తోంది.
టీపీసీసీ అధ్యక్ష పదవి దక్కకపోవడంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పటికే పలు మార్లు బహిరంగంగానే విమర్శలు గుప్పించారు. గతంలో ప్రకటించిన విధంగానే ఇప్పటి వరకూ కనీసం గాంధీ భవన్ కూడా రాలేదు. పార్టీ కార్యక్రమాలకు దాదాపుగా దూరంగానే ఉంటున్నారు. పార్టీ నిర్ణయానికి భిన్నంగా వైఎస్ఆర్ సంస్మరణ సభకు హాజరయ్యారు. మరోవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి బయట పడకపోయినా.. రేవంత్ తో ఆయనకు పడటం లేదు. పార్టీ నిరసనలు, ఆందోళనల్లో అంటీ ముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో రేవంత్ రెడ్డి ఒక్కరే టీఆర్ఎస్ పై పోరాడాల్సిన పరిస్థితి నెలకొంది. కొన్ని రోజులుగా ఈ అంశం పార్టీలో హాట్ టాపిక్ గా మారింది. రేవంత్ ను అధ్యక్షుడిగా ప్రకటించిన కొత్తలో కొందరు అసంతృప్తి వ్యక్తం చేసినా.. అధిష్ఠానం నిర్ణయాన్ని గౌరవించి కలిసి నడుస్తున్నారు. వీరిద్దరు మాత్రమే ఇప్పటికీ భిన్నంగా వ్యవహరించండం వివాదాస్పదమవుతోంది.
గజ్వేల్ సభ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించుకుని మల్లికార్జున ఖర్గే వస్తే.. ఎంపీలు ఇద్దరూ కనీసం మర్యాద పూర్వకంగా కూడా కలకపోవడంపై అధిష్ఠానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జి ఠాగూర్ ను నివేదిక కోరనున్నట్లు చెబుతున్నారు. పార్టీకి వ్యతిరేకంగా చేసిన కామెంట్లు, వారి వ్యవహార శైలి వంటి వివరాలను సేకరించేందుకు అధినాయకత్వం సన్నాహాలు చేస్తోంది. పార్టీ కార్యక్రమాలకు వారు హాజరు కాకపోవడానికి కారణాలేంటి? వారి ఉద్దేశాలేంటి? అని రాహుల్ గాంధీ సైతం ఇతర ముఖ్యనేతలను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రేవంత్ కు అందరూ సహకరించాల్సిందేనని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో ఈ నెలలో పార్టీ తలపెట్టే నిరసన కార్యక్రమాలకైనా వారు హాజరవుతారా? లేదా? అన్నది చర్చనీయాంశంగా మారింది.