
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ గత కొద్ది రోజులుగా పార్టీ నేతలకు, రాష్ట్ర ప్రభుత్వ అధికార యంత్రాగానికీ అందుబాటులో లేరు. అసలు ఆయన హైదరాబాద్ నగరంలోనే లేరు. గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగర శివార్లలోని ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలోనే ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార యంత్రాంగాన్ని, కేబినెట్ మంత్రులు, పార్టీ నేతలను ఎవరినీ కలవకుండా, ఎర్రవెల్లి ఫాంహౌస్ లో ఉంటున్నారు. సరిగ్గా చెప్పాలంటే అక్టోబర్ 25 తర్వాత సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ప్రజలకు కనిపించలేదు.
తెలంగాణ రాష్ట్ర సమితి 20వ వార్షికోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ టీఆర్ ఎస్ ప్లీనరీలో కనిపించారు. వేలాదిగా తరలి వచ్చిన అభిమానులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. .గచ్చి బౌలి లోని హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన టీఆర్ ఎస్ ప్లీనరీ సమావేశాలు ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ నేరుగా ఎర్రవెల్లి ఫాంహౌస్‌కు వెళ్లారు.
సీఎం కేసీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన హుజూరాబాద్ ఉప ఎన్నికలు అక్టోబర్ 30వ తేదీన జరిగాయి. నవంబర్ రెండో తేదీన ఫలితాలు వెల్లడి అయ్యాయి. కానీ, ఎక్కడా సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఆ ఫలితాలపై ప్రకటన చేయలేదు. టీఆర్ ఎస్ ఓటమిపై ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రజల ముందుకు రాలేదు. రెండు వారాల నుంచి సీఎం కేసీఆర్ ప్రజలకు అందుబాటులో లేకుండా పోయారు. అయితే, హుజూరాబాద్ ఫలితాలపై ముందుగానే సీఎం కేసీఆర్‌కు అంచనా ఉందని , అందువల్లనే ఆయన ఫాంహౌస్ విడిచి పెట్టి రావడం లేదని టీఆర్ ఎస్ నేతలు భావిస్తున్నారు. ఆ కారణంగానే ఫాంహౌస్ వద్దకు తనను కలవడానికి వచ్చే సందర్శకులకు ఎట్టి పరిస్టితుల్లోనూ అపాయింట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని వారు అభిప్రాయ పడుతున్నారు. సామాన్యులతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో సహా ఎవరికీ కేసీఆర్ అపాయింట్మెంట్ ఇవ్వక పోవడానికి కారణం టీఆర్ ఎస్ ఓటమి భారమేనని చర్చించుకుంటున్నారు., దీంతో సీఎం కేసీఆర్ ఇంకా హుజూరాబాద్ ఓటమి భారం నుంచి బయట పడలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.