
మహనీయుడు, స్ఫూర్తి ప్రదాత సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశంసించారు. సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం నివాళులర్పించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ, సుల్తానుల రాచరిక ఆగడాలను ఎదిరించిన ధీరుడు, గోల్కొండలో హైందవ కేతనం ఎగరవేసిన వీరుడు, తెలంగాణ శివాజీ సర్వాయి పాపన్న గౌడ్ అని కొనియాడారు. అటువంటి మహనీయుడికి తెలంగాణలో గుర్తింపు లేకుండా పోయిందన్నారు. ఆయన చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చి స్ఫూర్తి దాయకంగా ఉండాల్సిన రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేయకపోవడం దురదృష్టకరమని అన్నారు.
సర్వాయి పాపన్నను ముఖ్యమంత్రి కేసీఆర్ స్మరించుకోరని, ప్రభుత్వం ఇలాంటి దుస్థితికి దిగజారిందని సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి మహనీయుల చరిత్రను కనుమరుగు చేసి కేసీఆర్ తన చరిత్రను, తన కుటుంబ చరిత్రను మాత్రమే ముందు తరాలకు అందించాలనే దుర్మార్గపు ఆలోచనలో ఉన్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కుటుంబపాలనను, అవినీతి పాలనను అంతమొందించాలనే లక్ష్యంతో సర్వాయి పాపన్నను స్ఫూర్తిగా తీసుకుని ఈ నెల 24వ తేదీ నుంచి ప్రజా సంగ్రామ యాత్రను బీజేపీ ప్రారంభించనుందని ప్రకటించారు.