
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ బదిలీ అయ్యారు. సజ్జనార్ స్థానంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా స్టీఫెన్ రవీంద్రని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సజ్జనార్‌ను ఆర్టీసి ఎండీగా నియమించారు.సజ్జనార్ సైబరాబాద్ కమిషనర్ గా మూడేళ్ల పాటు విధులు నిర్వహించారు. ఆయన తన పదవీ కాలంలో సమర్థవంతమైన పోలీస్ అధికారిగా పేరు తెచ్చుకున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన ‘దిశ’ హత్యాచార నిందితుల ఎన్ కౌంటర్ ఘటన ఆయన హయాంలోనే చోటుచేసుకుంది. అంతకుముందు వరంగల్‌లో యాసిడ్ దాడి నిందితుడి ఎన్‌కౌంటర్‌తోనూ ఆయన ‘గుర్తింపు’ పొందారు. ఎన్నో సేవా కార్యక్రమాలను నిర్వహించి మంచి పేరు తెచ్చుకున్నారు. మహిళల రక్షణకు వినూత్నమైన కార్యక్రమాలను కూడా సజ్జనార్ చేపట్టారు. 1996 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి సజ్జనార్. కీలకమైన కేసులను పరిష్కరించిన ఐపీఎస్‌గా ఆయనకు గుర్తింపు ఉంది. దిశ నిందితుల ఎన్ కౌంటర్ తర్వాత సజ్జనార్ పేరు దేశమంతా మార్మోగింది. మరోవైపు స్టీఫెన్ రవీంద్ర ప్రస్తుతం హైదరాబాద్ వెస్ట్ జోన్ ఐజీపీగా ఉన్నారు.