
ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయ నిర్మాణానికి సెప్టెంబర్ 2 తారీఖున సీఎం కేసీఆర్ చేతుల మీదుగా భూమి పూజను నిర్వహించనున్నట్లు మంత్రి కేటీ రామారావు తెలిపారు. తదుపరి 32 జిల్లాల పార్టీ కార్యాలయాలను కేసీఆర్ గారు అక్టోబరులో ప్రారంభిస్తారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు కమిటీల నిర్మాణ ప్రక్రియను సెప్టెంబర్ 2న ప్రారంభించనున్నామని ఆయన తెలిపారు. అదే నెలలో జిల్లా కమిటీల ఎంపిక కూడా పూర్తవుతుందని చెప్పారు.
టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది ఉత్సవాలను అక్టోబర్ లేదా నవంబర్ నెలల్లో నిర్వహిస్తామని కేటీఆర్ తెలిపారు. గత రెండు దశాబ్దాల కాలంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నో ఘన విజయాలను సాధించిందని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర రాజకీయ క్షేత్రంలో టీఆర్ఎస్ పార్టీదే తిరుగులేని విజయమని అన్నారు. శాసనసభ ఎన్నికల నుంచి జిల్లాపరిషత్, మున్సిపల్, గ్రామ పంచాయతీ అన్నింటిలో టీఆర్ఎస్ తిరుగులేని విజయాలను సాధించిందని చెప్పారు. 119 అసెంబ్లీ స్థానాలకు గాను 88 సీట్లు, 17 పార్లమెంటు స్థానాలకు గాను 9 సీట్లను గెలుచుకున్నామని తెలిపారు.