
తెలంగాణ రాష్ట్రంలో దట్టమైన అడవుల నడుమ, కొండల మధ్య అత్యద్భుతంగా వుండే ప్రాంతం, ట్రెక్కింగ్ చేయాలనుకొనే వారు ఎక్కడికో పోవలసిన అవసరం లేదు ఈ ఖిల్లా చాలు ఎన్నో మధురానుభులు మిగల్చడానికి.
అత్యంత పొడవైన, విశాలమైన ఖిల్లా మన రామగిరి, రాముడు నడయాడిన రమ్యమైన రామగిరి, అలనాటి చారిత్రక కట్టడాలకు నిదర్శనమే ఈ ఖిల్లా. ఆయుర్వేద వనమూలికల భాండాగారం, విభిన్న జాతుల వృక్షాలకు నిలయం ఈ రామగిరి. ఆది మానవులకు ఆవాసమైన తావు, ప్రకృతి ప్రేమికులకు సుగంధపు పరిమళాలు వెదజల్లే సాంబ్రాణి ఈ ఖిల్లా..శాతవాహనుల నుంచి అసఫ్ జాహీల వరకు పాలన కేంద్రమైన కీర్తి కిరీటం రామగిరి. అనేక జలపాతాలకు జన్మనించిన జనని,
ప్రకృతి ఒడిలో సేద తీరుతూ ప్రపంచాన్ని సైతం మైమరపించే అధ్బుతమైన పర్యాటక యాత్ర క్షేత్రం. రామగిరి ఖిల్లా యాత్ర చేయాలంటే సాహసంతో సావాసం చేయాల్సిందే, ఈ రామగిరి ఖిల్లాను సందర్శించడానికి తెలంగాణాలోని వివిధ జిల్లాలతోపాటు,మహారాష్ట్ర ఇతర రాష్ట్రాల వారు వస్తారు..
పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి మంథని వేళ్ళే ప్రధాన రహదారిలో బేగంపేట్ ‘X’ రోడ్ వద్ద దిగి ఆటోల ద్వారా
బేగంపేట్ గ్రామంలోపలికి వేళ్ళి సుమారు 3 కి.లో మీటర్లు కాలినడకన ద్వారా ఈ ఖిల్లాను చేరుకోవచ్చు.
ఏ సమయంలో వెళ్ళాలి?
ప్రతి సంవత్సరం ఆగష్టు మరియు సెప్టెంబర్ మాసాలలో ముఖ్యంగా శ్రావణ మాసంలో ఈ ఖిల్లాను సందర్శించడానికి వీలుంటుంది. ఉదయం 8 గంటల వరకే బేగంపేట్ గ్రామానికి చేరుకునే విధంగా చూసుకోవాలి..
యాత్ర చేయడానికి తీసుకోవలసిన జాగ్రత్తలు??
ఖిల్లా పై సుమారు 15-20 కిలోమీటర్లు కాలినడక చేయాలి కాబట్టి కాళ్ళకు షూస్ వేసుకోవడం మంచిది.
ఎక్కువ మోతాదులో త్రాగునీరు వెంటతీసుకొని మరియు అల్పాహారం ,భోజనం ముందుగానే తయారుచేసుకొని వెళ్ళాలి.
ఒంటరిగా వెళ్ళకుండా గుంపులుగా వెళ్ళాలి.

రామగిరి ఖిల్లాపై చూడదగ్గ ప్రదేశాలు….

కోటలోకి ప్రవేశించడానికి ఏడు దర్వాజాలు,మొదటి దర్వాజకి కుడివైపు వేళ్ళితే సముద్ర జలపాతం,రెండవ దర్వాజ ప్రవేశంలో కుడివైపు గోడపైన గల క్రీ.శ 1556 నాటి పది పంక్తులలో గల తెలుగు శాసనం(శాసనం వివారాలు:తుమ్మిఖాన్ అనే వ్యక్తి రెండవ దర్వాజ నిర్మాణానికి 10 వేల రుపాయాల ఖర్చు అయినట్టు అట్టి ఖర్చును పన్నురూపంలో స్థానిక ప్రజలు చెల్లించవలెనని ఉంది ),దర్వాజ ప్రవేశించిన తర్వాత ఎడమవైపు గల అధ్బుతమైన పచ్చని కోట మరియు 25 మీటర్ల పొడవు గల అతి పెద్ద ఫిరంగి, నాల్గవ దర్వాజ పై గల సృష్టిశిల్పాలతో పాటు,ఏనుగు తో పోరాడుతున్న యోధుడి శిల్పం,రెండు తలల గరుత్మంతుడి శిల్పం.
పిల్లల ఫిరంగీ:సుమారు 15 మీటర్ల పొడవు గల ఫిరంగీని స్థానికులు పిల్లల ఫిరంగీ గా పిలుస్తారు ఇందులో నుంచి దూరితే సంతానంలేని వారికి పిల్లలు పుడుతారని, ఆయురారోగ్యాలతో జీవిస్తారని ప్రజల యొక్క విశ్వాసం.

ఆరవ దర్వాజ నుంచి 21 మెట్లు ఎక్కి కోటపైనుంచి కనిపించే మానేరువాగు వయ్యారాలతోపాటు
ఖిల్లాపై గల వివిధ చారిత్రక స్థలాలైన సీతమ్మ స్నానమాడిన కొలను, పసరుబావులు, పసుపు కంకుమ భరణీ, సవతుల బావులు,మాధవీ మండపం, రాముడు ప్రతిష్టించిన రామలింగాలు,హనుమంతుడి విగ్రహం, చరశాలలు,గజశాలలు,అశ్వశాలలు,నీటి సౌకర్యాన్ని రాజమందిరానికి తరలించిన రాతి నీటిగొట్టాలు,చివరగా సీతారాముల దేవస్థానాన్ని దర్శించుకుని సుమారు సాయంత్రం 5 గంటల వరకు యాత్ర ముగుస్తుంది..


తెలంగాణ లో అత్యంత పొడవైన మరియు విశాలమైన ఎంతో చారిత్రక ప్రాధాన్యం గల రామగిరి ఖిల్లా ను పర్యాటక ప్రదేశంగా అభివృద్ధి చేసి ,ఖిల్లా వరకు రవాణా సౌకర్యాన్ని కల్పించి యాత్ర మార్గ నిర్దేశక సూచికలను ఏర్పాటు చేయాలి అలాగే పెద్దపల్లి,గోదావరిఖని ,కరీంనగర్ ప్రధాన కేంద్రాలలో ఖిల్లా ప్రాధాన్యత ను తెలిపేలా పర్యాటక శాఖ వారు ప్రచార బోర్డులను పెట్టడంతోపాటు అత్యాధునిక సౌకర్యమైన రోప్ వే ను ఖిల్లా దిగువ భాగం నుంచి పైకి నిర్మాణం చేస్తే నిత్యం పర్యాటకులతో కనువిందు చేస్తుంది.
విషయరచణ మరియు పెద్దపల్లి జిల్లా చరిత్ర పరిశోధకుడు…:
–కుందారపు సతీష్ నేత