
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్ రావు మరోసారి హస్తిన పర్యటనకు వెళ్లనున్నారు. ఈ నెలలో కేసీఆర్ కు ఇది రెండోసారి ఢిల్లీ పర్యటన కావడం విశేషం. రెండ్రోజుల పాటు కేసీఆర్ ఢిల్లీలోనే ఉండనున్నారు. ఈ నెల 26న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆద్వర్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఉంది. ఈ సమావేశంలో తెలంగాణ, ఏపీ, ఒడిశా, చత్తీస్ ఘడ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్, ఉత్తరప్రదేశ్ సీఎంలు పాల్గొనబోతున్నారు. ఈసారి పర్యటన సందర్భంగా మరికొందరు కేంద్రమంత్రులను కేసీఆర్ కలిసే అవకాశం ఉన్నట్లు సీఎంవో వర్గాల సమాచారం. డీజీపీ మహేందర్ రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్ కూడా కేసీఆర్ వెంట ఢిల్లీ వెళ్లబోతున్నట్లు సమాచారం.
కాగా, ఈ నెల 1న కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. దేశ రాజధానిలో తెరాస కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించిన సీఎం.. ఆ పనుల నిమిత్తం వెళ్లారు. అక్కడ కేవలం 3 రోజుల పాటు బస చేయాలని భావించిన కేసీఆర్.. పలు కార్యక్రమాల దృష్ట్యా అక్కడే 9 రోజులు ఉండిపోయారు. 2వ తేదీన ఢిల్లీలో టీఆర్ఎస్ కార్యాలయానికి కేసీఆర్ శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం 3న ప్రధాని మోదీతో సీఎం కేసీఆర్ భేటీ అయ్యారు. సుమారు 50 నిమిషాల పాటు మోదీతో సమావేశమైన కేసీఆర్.. రాష్ట్రానికి సంబంధించిన పది అంశాలపై విడివిడిగా పది లేఖలు అందజేశారు.