
హుజూరాబాద్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ అక్టోబరులో వెలువడనుందా? నవంబరులోనే ఉప ఎన్నిక జరిగే అవకాశం ఉందా? అంటే అవుననే అంటున్నాయి అధికార వర్గాలు. ఈ మేరకు ఉప ఎన్నికపై సంసిద్ధత వ్యక్తం చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపినట్లు తెలిసింది. దేశవ్యాప్తంగా ఉప ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఇటీవల పలు రాష్ట్రాలకు చెందిన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఇందులో రాష్ట్రానికి చెందిన పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కొవిడ్ తీవ్రత ఉన్న నేపథ్యంలో ఉప ఎన్నికల నిర్వహణ కష్టమేనని సమావేశంలోనే కొన్ని రాష్ట్రాలు స్పష్టం చేశాయి. ఇప్పటికిప్పడు ఎన్నికలు నిర్వహించే పరిస్థితులు లేవని పేర్కొన్నాయి. ఈ సందర్భంగా ఎన్నికల సంసిద్ధతకు సంబంధించిన అంశాలపై లిఖిత పూర్వక నివేదిక ఇవ్వాలని అన్ని రాష్ట్రాలను సీఈసీ కోరింది. ఈ నేపథ్యంలో హుజూర్బాద్ నియోజకవర్గంలోని పరిస్థితులు, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన విషయాలతో రాష్ట్ర ప్రభుత్వం నివేదిక పంపింది. ఆ నియోజకవర్గంలో 18 ఏళ్లు పైబడిన వారికి సెప్టెంబరు చివరికి వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. అక్టోబరులో నోటిఫికేషన్ ఇచ్చి.. నవంబరులో ఉప ఎన్నిక జరపాలని అందులో కోరినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.
అయితే, ఇతర రాష్ట్రాల్లోనూ ఉప ఎన్నికల నిర్వహణకు అనువైన పరిస్థితులు నెలకొనే దాకా ఈ ప్రక్రియ ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. ఈ విషయమై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ మాట్లాడుతూ హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో జరుగుతున్న ప్రచారాల్లో వాస్తవం లేదని, కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయిస్తే ఎప్పుడైనా నిర్వహించేందుకు తాము సిద్ధమని పేర్కొన్నారు. ఉప ఎన్నిక తేదీపై సీఈసీ నుంచి ఇప్పటిదాకా ఎలాంటి సంకేతాలు రాలేదని పేర్కొన్నారు. కానీ, హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఎన్ని ఈవీఎంలు అవసరమవుతాయి? కొవిడ్ నేపథ్యంలో పెంచాల్సిన అవసరం ఉందా? తదితర అంశాలపై ఇటీవల సమీక్ష జరపడం.. ఉప ఎన్నిక నిర్వహణ సన్నద్ధతలో భాగమేనని రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఉప ఎన్నిక ప్రక్రియ ప్రారంభం కాకముందే హుజూరాబాద్ లో పార్టీల ప్రచార వేడి పెరిగింది. వచ్చే నెలలో నోటిఫికేషన్ వెలువడితే ఇది తారాస్థాయికి చేరే అవకాశం ఉంది.