
తీన్మార్ మల్లన్నకు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధిస్తూ నిజామాబాద్ కోర్టు సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. తీన్మార్ మల్లన్న, ఆయన అనుచరుడు ఉప్పు సంతోష్.. తనను డబ్బులు డిమాండ్ చేశారంటూ ఓ కల్లు వ్యాపారి ఇచ్చిన పిర్యాదుతో నిజామాబాద్ పోలీసులు ఈ నెల 10న కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో ఉప్పు సంతోష్ ఏ1, మల్లన్నను ఏ2గా చేర్చారు. పోలీసులు.. సంతోష్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించారు.
ఆ సమయంలో మల్లన్న చంచల్‌గూడ జైలుల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. దాంతో నిజామాబాద్ పోలీసులు ఆయన కోసం పీటీ వారెంట్ దాఖలు చేశారు. కోర్టు అనుమతిలో మల్లన్నను చంచల్‌గూడ జైలు నుంచి తీసుకెళ్లి నిజామాబాద్ కోర్టులో హాజరుపరిచారు. కాగా ఈ కేసులో ఆయనకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండు విధిస్తూ న్యాయమూర్తి ఉత్తర్వులిచ్చారు.