
టీ20 ప్రపంచకప్ లో భారత జట్టు పాకిస్తాన్, న్యూజీలాండ్ చేతుల్లో ఓడిపోయింది. అంతమాత్రాన కొంపలేమీ మునిగిపోలేదు. మిగిలిన అన్ని మ్యాచ్ లలోనూ టీమిండియా ఓడిపోయినా ఎవరికీ ఎలాంటి నష్టం లేదు. పోటీలో గెలుపు, ఓటములు సహజం. కానీ, సోషల్ మీడియాలో కొందరు వెధవలు దారుణమైన కామెంట్లు పెడుతున్నారు. టీమిండియా కెప్టెన్ కోహ్లీని లక్ష్యంగా చేసుకుని అమానుషమైన వ్యాఖ్యలు పోస్ట్ చేస్తున్నారు. టీమ్ ఇండియా బౌలర్ మహ్మద్ షమీని టార్గెట్ చేసిన నెటిజన్లు నిన్నటి దాకా సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు.
షమీకి సపోర్ట్ గా నిలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీని, అతడి కుటుంబాన్ని ఇప్పుడు నెటిజన్లు టార్గెట్ చేశారు. కోహ్లీ భార్యను, కుమార్తెను కూడా ఇందులోకి లాగుతున్నారు. చిన్నారి ఫొటోను విడుదల చేయాలని, ఆమెపై అత్యాచారానికి పాల్పడతామంటూ దారుణమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై పలువురు సోషల్ మీడియా యూజర్లు మండిపడుతున్నారు. ఆటను ఆటగానే చూడాలని, ఆటగాళ్ల కుటుంబాలను టార్గెట్ చేయకూడదని హితవు పలుకుతున్నారు.
పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హక్, మహ్మద్ అమీర్ లు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించారు. ‘‘విరాట్ కూతురికి బెదిరింపులు వస్తున్నాయని తెలిసింది.. సోదరులారా.. ఇది ఒక ఆట. మేమంతా ఆటగాళ్లం. అది ఇండియా కావచ్చు. పాకిస్థాన్ కావచ్చు. మేమందరం ఒకే కమ్యూనిటీ (క్రీడాకారులు)కి చెందినవాళ్లం. మేమంతా ఒక కుటుంబం. ఒకవేళ మీకు కోహ్లి ఆట నచ్చకుంటేనో, సారథ్యం నచ్చకుంటేనో అతడిని ఏమైనా ప్రశ్నించండి. కానీ అతడి కుటుంబాన్ని ఇందులోకి లాగొద్దు..’’ అంటూ విన్నవించారు. పాకిస్తాన్ క్రికెటర్లకు ఉన్నంత బుద్ధి కూడా సోషల్ మీడియా వెధవలకు లేకపోవడం విచారకరం. గతేడాది ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ చేతిలో చెన్నైసూపర్ కింగ్స్ ఓటమి పాలైన సందర్భంలో ధోనీ కూతురికి కూడా ఇలాంటి బెదిరింపులే ఎదురయ్యాయి.